తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనయుడు హిమాన్షు మ‌రోమారు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. క్రిస్మస్ పండుగ సంద‌ర్భంగా ఆయ‌న వినూత్న రీతిలో సంబురాల్లో పాల్గొన్నారు. సైదాబాద్‌లోని జువైనల్‌ హోమ్‌లో హిమాన్షు చిన్నారుల సమక్షంలో క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు కేక్‌, మిఠాయిలు పంచిపెట్టారు. అలాగే వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ.. `క్రిస్మస్‌ శాంతి, కరుణ, ప్రేమలకు ప్రతిరూపం. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రేమ, ఆప్యాయతలు కలుగజేయాలని జీసస్‌ను ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. జువైనల్‌ హోమ్‌ చిన్నారులతో క్రిస్మస్‌ వేడుకులు జరుపుకోవడం ఆనందంగా ఉంది` అని ఈ సందర్భంగా హిమాన్షు సంతోషం వెలిబుచ్చారు.

 

 

ఇదిలాఉండ‌గా, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌ రావు క్రిస్టియ‌న్ల‌ పట్ల చూపిస్తున్న ఆదరణ అమోఘమని మైనార్టీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌ లూకా అన్నారు. క్రిస్టమస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన ముఖ్యమంత్రిని ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిగా సీఎం సైతం లూకాకు క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ సీఎంను ఉద్దేశించి.. మీరు క్రిస్టియన్లకు ఇస్తున్న ప్రాధాన్యత మరవలేనిదన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా క్రిస్మస్‌ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని మైనార్టీలైన క్రిస్టియన్లు, ముస్లింలు, సిక్కులు మొదలగు వారికి తగిన ప్రాధాన్యతనిచ్చి, వారికి అన్ని విధాల చేయూతనిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. 

 

ఇదిలాఉండ‌గా, తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో క్రైస్తవ సోదరసోదరీమణులు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శభాకాంక్షలు తెలియజేశారు. చర్చిలో క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: