తెలంగాణ రాష్ట్రంలో విస్తరించడానికి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) వడివడిగా అడుగులేస్తోంది. ఆరెస్సెస్‌ ఆవిర్భవించి 2025 నాటికి వందేళ్లు పూర్తవనుంది. అప్పటికల్లా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకూ చేరే లక్ష్యంతో పటిష్ట కార్యాచరణ రూపొందించింది. మంగళవారం నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ శివార్లలోని నవభారత్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ‘విజయ సంకల్ప శిబిరం’ పేరుతో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

 

విజయ సంకల్ప శిబిరం సభలో ఆరెస్సెస్ చీఫ్, సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కీలక ఉపన్యాసం చేసారు. బహిరంగ సభలో 25 వేల మందికి పైగా స్వయం సేవకులు పాల్గొన్నారు. సర్‌ సంఘ్‌చాలక్‌.. మోహన్‌ భాగవత్‌ పర్యవేక్షణలో సుమారు 8 వేల మంది ముఖ్య శిక్షక్‌లు, ఆ పైస్థాయి వారికి సంస్థ కార్యక్రమాలను వేగవంతం చేయడంలో శిక్షణ ఇస్తున్నారు. సంఘ్‌ కార్యక్రమాలను గ్రామ స్థాయి దాకా తీసుకెళ్లడానికి సంకల్పించిన ఆరెస్సెస్‌.. 1613 క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ఒక్కో క్లస్టర్‌లో 5, 6 గ్రామాలు ఉంటాయి. అదేవిధంగా పట్టణాల్లో 850 బస్తీలను గుర్తించారు. 

 

తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో తమ కార్యక్రమాలకు ఆదరణ పెరిగిందని సంఘ్‌ పెద్దలు చెబుతున్నారు. ఈ ఏడాది అనూహ్యంగా శాఖలు పెరిగాయని వెల్లడించారు. గత 60 ఏళ్లలో తెలంగాణాలో రెండు వేల సంఘ్‌ శాఖలు ఏర్పడగా.. 2019 ఒక్క ఏడాదిలోనే వెయ్యి శాఖలు పెరగాయని తెలిపారు.

 

ఆరెస్సెస్ బహిరంగ సభ కంటే ముందు నగరంలోని నాలుగు ప్రాంతాల నుంచి స్వయంసేవకుల పథ సంచలన్ కార్యక్రమం మొదలైంది. మన్సూరాబాద్ కేబీఆర్ కన్వెన్షన్ సెంటర్, వనస్థలిపురం లలితా గార్డెన్స్, సరూర్ నగర్ మండల కార్యాలయం, హస్తినాపురం రామిరెడ్డి గార్డెన్స్ నుంచి ఒక్కో బృందం రూట్ మార్చ్ చేపట్టింది. వీరంతా ఒకేసారి ఎల్‌బీ నగర్ చౌరస్తాలో కలుసుకున్నారు. పథ సంచలన్ (రూట్ మార్చ్)తో హైదరాబాద్ నగరంలో సందడి నెలకొంది. అనంతరం అక్కడి నుంచి బహిరంగ సభ జరిగే సరూర్ నగర్ స్టేడియంకు చేరుకున్నారు. ముందర బ్యాండ్ బృందం నడుస్తుండగా ఓ క్రమపద్ధతిలో వారు సాగిపోతున్న తీరు నగరవాసులను ఆకట్టుకుంది. ఈ ర్యాలీలో ఏడు వేల మంది స్వయంసేవకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: