ఏపీలో 3 రాజధానుల అంశంపై రగడ కొనసాగుతోంది. సీఎం జగన్ ప్రకటన, జీఎన్ రావు కమిటీ నివేదికపై రాజధాని ప్రాంతంలోని రైతాంగం భగ్గముంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 27న అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.


 కేబినెట్ సమావేశం జరిగే రోజున నిరసనలకు అనుమతి నిరాకరించారు. మంత్రులు సెక్రటేరియెట్‌కు వెళ్లే దారిలో ఎలాంటి ఆందోళనలు చేయకూడదని హెచ్చరించారు. ఇప్పటికే మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రహదారి పక్కన ఉన్నఇళ్ల యజమానులకు పోలీసులు నోటీసులు జారీచేశారు. మందడం గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. మరోవైపు ఏపీ కేబినెట్ సమావేశం ఎక్కడ జరుగుతుందన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. వెలగపూడిలో జరిగే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్టణంలో నిర్వహిస్తారనే  ప్రచారం కూడా జరుగుతోంది.

 

ఏపీలో 3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంతంలోని 28 గ్రామాల రైతులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే దారిలో మహా ధర్నా చేపట్టారు. రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఆ రూట్లో రాకపోకలు స్తంభించిపోయింది. ఐతే శుక్రవారం కేబినెట్ భేటీ ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు. కాగా,  కేబినెట్ సమావేశంలో ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. జీఎన్ రావు ఇచ్చిన నివేదిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని... మూడు రాజధానుల ప్రతిపాదనపై కీలక ప్రకటన చేస్తారని సమాచారం.  అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం వస్తే ఆ ప్రాంత రైతులు ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తే అవకాశముంది. ఈ క్రమంలోనే అమరావతి ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు పోలీసులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: