ఏపీలో ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగాలను కోరుకుంటున్న అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. 2020 ఫిబ్రవరి నెలలో డీఎస్సీ 2020 నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. డీఎస్సీ ద్వారా ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలో ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల, గురుకులాలు, మోడల్ పాఠశాల్లో కలిపి 10 నుండి 12 వేల పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఉపాధ్యాయ ఖాళీలను 75 నుండి 480 వరకు విద్యార్థులున్న పాఠశాలను ఒక యూనిట్ గా తీసుకొని నిర్ధారిస్తారు. ఆరుగురు సబ్జెక్టు టీచర్లు, ముగ్గురు భాషా పండిట్ల చొప్పున ఉన్నత పాఠశాలల్లో 9 మంది టీచర్లు ఉండాల్సి ఉండగా ఈ ప్రకారం లేని పాఠశాలల వివరాలను తీసుకుని ఉపాధ్యాయ ఖాళీలను నిర్ధారిస్తారు. పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను , త్వరలో రిటైర్ కాబోయే వారి వివరాలను సేకరించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 
 
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 7,902 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ 2018 పేరుతో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ను దివ్యాంగుల కోసం 602 టీచర్ పోస్టులతో ఇచ్చింది. విద్యార్హతలు, సాంకేతిక అంశాలను కారణాలుగా చూపిస్తూ కొందరు కోర్టుల్లో కేసులు వేయగా ఈ కేసులపై విచారణ కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ నెల 22వ తేదీన కోర్టు కేసులు లేని 2,654 పోస్టుల భర్తీకి కౌన్సిలింగ్ జరిగింది. 
 
5,850 టీచర్ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా జరగలేదు. విద్యాశాఖ జనవరి నెలాఖరులోపు కేసులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటోందని సమాచారం. ప్రభుత్వం జనవరి నెల మొదటి వారంలో టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ జారీ చేయనుండగా జనవరి నెలాఖరులో టెట్ పరీక్ష జరగనుంది. దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు టెట్ కు ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పాఠశాల విద్యాశాఖ వర్గాలు 5లక్షల నుండి 6 లక్షల మంది డీఎస్సీ 2020కి ధరఖాస్తు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వం టెట్, డీఎస్సీ నిర్వహణలకు సంబంధించి త్వరలో ప్రకటన చేయనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: