సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ సీఎం, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు జగన్ దెబ్బకు విలవిల్లాడుతున్నాడు. రాజకీయాల్లో ఎంతకాలం ఉన్నాం  అన్నది కాదు ప్రజలకు ఎంత మేలు చేసాం అనేది ముఖ్యం అనే విధానంతో వెళ్తూ జగన్ ప్రజల్లో రోజు రోజుకి బలం పెంచుకుంటున్నాడు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీలో ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటోంది. ఆ పార్టీలో చంద్రబాబును నమ్ముకుని ఉన్న నాయకులంతా ఇప్పుడు రాజకీయ పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో పార్టీ నిర్ణయం ప్రకారం జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ద్వారా అటు ప్రజల్లోనూ, ఇటు అధికార పార్టీ దృష్టిలోనూ తాము విలన్లుగా మారాము అనే భయం ఆ పార్టీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే అదును చూసి వైసీపీ లోకి గాని, జాతీయ పార్టీ బీజేపీలోకి కానీ వెళ్లాలని ఆ పార్టీ నాయకులంతా ఆలోచనలో పడ్డారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని ఏకాకిని చేసే దిశగా జగన్ కొత్త ఎత్తుగడలను సిద్ధం చేస్తున్నారు.


 దీనికోసం ఎప్పటికీ ఓ ప్రత్యేక టీమ్ కూడా పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీలైనంత వరకు బీజేపీకి దగ్గర అవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఎన్డీఏ కూటమికి ప్రత్యక్షంగానో పరోక్షంగానూ మద్దతు ఇవ్వాలని చూస్తున్నారు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కు  ప్రధాన మద్దతుదారుగా ఉంది. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని చంద్రబాబు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేశారు. అందుకే కేంద్ర అధికార పార్టీతో సఖ్యత గా ఉంటూ ఆ తరువాత విరోధం పెట్టుకున్నాడు చంద్రబాబు. అక్కడి నుంచే టీడీపీ పతనం మొదలయినట్టుగా కనిపించింది. అయితే ఇప్పుడు  లోక్ సభలో చంద్రబాబు బలం కేవలం ముగ్గురు సభ్యులే. ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలు బిజెపిలో చేరిపోవడంతో టిడిపి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. ఎన్నికల ముందు బీజేపీతో విరోధం పెట్టుకుని చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదం చేశారు.


 ఈ విషయం ఎన్నికల ఫలితాల తర్వాత తీరిగ్గా ఆలోచించుకున్న బాబు ఇప్పుడు ఏదో ఒక రకంగా ఎన్డీఏలోని బీజేపీతో సహా పాత మిత్రులతో కొత్త స్నేహం చేయాలని చూస్తున్నారు. అందుకే సందర్భం ఉన్నా లేకపోయినా, అమిత్ షా, మోదీలను అదే పనిగా పొగుడుతూ  ట్విట్టర్ లో అభినందనలు, శుభాకాంక్షలు చెప్పేందుకు బాబు ముందున్నాడు. అలాగే తమ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కొంతమంది రాజ్యసభ సభ్యుల ద్వారా ను బిజెపి లో ఉన్న తన పాత మిత్రుల ద్వారానూ టీడీపీ ఎన్డీయేలో చేరే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన జగన్ జాతీయ స్థాయిలో చంద్రబాబు హవా పెరగకుండా కట్టడి చేసేలా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగానే ఎన్డీఏకు దగ్గర అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎన్డీఏ ప్రవేశపెడుతున్న ప్రతి బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలోనూ వైసిపి తమ మద్దతును తెలియజేస్తూ మీ వెంటే మేము అనే విధంగా వ్యవహరిస్తోంది.


 రాజ్యసభలో బీజేపీకి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకరించి ఎన్ డి ఏ కు మరింత చేరువ అవ్వాలని భావిస్తోంది వైసిపి. ఇప్పటికిప్పుడు జగన్ బీజేపీతో కలవకపోయినా బయట నుంచి మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరిస్తోంది. ఇక అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీగా వైసీపీని గుర్తించి ఆ మేరకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ కూడా చూస్తోంది. అంటే పెద్దగా బలం లేని చంద్రబాబుని నమ్ముకుని ముందుకు వెళ్ళడం కంటే జగన్ మద్దతు తీసుకుంటేనే బెటర్ అన్న ఆలోచనలో ఉంది. ఈ విధంగా చూస్తే ఏపీలో వైసిపి కొట్టిన దెబ్బ జాతీయ స్థాయిలో టిడిపికి గట్టిగానే తగిలినట్టుగా కనిపిస్తోంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: