దేశ‌వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ లైంగికదాడి, హత్య కేసులో సంచ‌ల‌న ప‌రిణామానికి స‌ర్వం సిద్ధ‌మైంది. అభం శుభం తెలియ‌ని దిశ‌పై ప్ర‌ధాన నిందితుడు మహ్మద్  ఆరిఫ్ స‌హ‌ నిందితులు శివ, నవీన్‌, చెన్నకేశవుల దారుణంగా అత్యాచారం చేసి హ‌త్య చేసిన తీరు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అనంత‌రం సీన్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్‌లో వారు క‌న్నుమూశారు. పోస్టుమార్టం అనంతరం ఎన్‌కౌంట‌ర్ విష‌యంలో నిందితుల కుటుంబ స‌భ్యులు అభ్యంత‌రం వ్య‌క్తంచేయ‌గా... మ‌ళ్లీ రీపోస్ట్‌మార్టం చేశారు. అనంత‌రం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించగా, స్వగ్రామాల్లో అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే, ఈ మొత్తం కేసును సంబంధించి సైబరాబాద్‌ పోలీసులు ఫైనల్‌ రిపోర్ట్‌ సిద్ధం చేశారు.

 

దిశ కేసులోని నిందితులు డిసెంబర్‌ 6న జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందడంతో చార్జిషీట్‌ స్థానంలో పోలీసులు ఫైనల్‌ రిపోర్టు పేరుతో కోర్టు ముందు నివేదిక పెట్టనున్నారు. ఈ నివేదికను మరో మూడురోజుల్లో మహబూబ్‌నగర్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో దాఖలు చేయనున్నారు. ఈ కేసులో పోలీసులు 30 మందికి పైగా సాక్షుల స్టేట్‌మెంట్లతోపాటు శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో సేకరించిన ఆధారాలను కోర్టుకు అందజేయనున్నారు. ఫోరెన్సిక్‌, ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు నివేదికలను ఈ ఫైనల్‌ రిపోర్టులో చేర్చనున్నారు. ‘దిశ’కు సంబంధించిన సెల్‌ఫోన్‌, పవర్‌బ్యాంక్‌, వాచ్‌, నిందితుల ఫోన్‌తోపాటు ఇంకా క్రైం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నివేదికను ఫైనల్‌ రిపోర్టులో పొందుపరిచారు. శంషాబాద్‌, షాద్‌నగర్‌ పోలీసులు నమోదుచేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌లను కూడా జతపర్చారు. సీసీ కెమెరాల దృశ్యాలను కూడా కోర్టుకు అందించనున్నారు. అనంతరం 30 మంది సాక్షులు, నిందితుల తరఫు బంధువులు, విచారణాధికారులు విచారణకు కోర్టుకు హాజరుకానున్నారు.

 


కాగా, హైకోర్టు ఈ నెల 21న జారీచేసిన ఆదేశాల మేరకు దిశ నిందితుల మృతదేహాలకు ఢిల్లీ ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ సుధీర్‌గుప్తా, డాక్టర్‌ ఆదర్శ్‌కుమార్‌, డాక్టర్‌ అభిషేక్‌యాదవ్‌, డాక్టర్‌ వరుణ్‌ చంద్రలతో కూడిన బృందం రీపోస్ట్‌మార్టం చేసింది. డిసెంబర్‌ ఆరున జరిపిన మొదటి పోస్ట్‌మార్టం నివేదికను ఎయిమ్స్‌ బృందం పరిశీలించింది. అనంతరం నలుగురు యువకుల కుటుంబసభ్యులతో మాట్లాడింది. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా, తాము మాట్లాడాల్సింది ఏమీ లేదని, రీపోస్ట్‌మార్టం పూర్తిచేసి తమ పిల్లల మృతదేహాలను అప్పగిస్తే చాలని బదులిచ్చారు. మృతుల కుటుంబసభ్యుల వాంగ్మూలాన్ని రికార్డుచేసుకున్న ఫోరెన్సిక్‌ బృందం.. మహ్మ ద్‌ ఆరిఫ్‌, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ మృతదేహాలను గుర్తించాలని సూచించారు. కుటుంబసభ్యులు మృతదేహాలను గుర్తించిన తర్వాత వాటికి ఎక్స్‌రే తీయించి, వారి ముందే రీపోస్టుమార్టం నిర్వహించారు. ఆరు గంటలపాటు సాగిన రీపోస్టుమార్టం ప్రక్రియను హ్యాండ్‌క్యామ్‌తో వీడియో తీశారు. పోస్టుమార్టం సమయంలో పోలీసులతో సహా గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌, ఫోరెన్సిక్‌ వైద్యులను కూడా లోనికి అనుమతించలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం పోస్టుమార్టం ప్రక్రియను గోప్యంగా నిర్వహించారు. అనంతరం నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించగా, రెండు అంబులెన్స్‌ల్లో పోలీసు బందోబస్తు నడుమ స్వగ్రామాలకు తరలించగా అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: