రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ఇప్పటికే ఇరు పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కూడా జరుగుతోంది. వైసీపీటీడీపీ నాయకుల పోటాపోటీ ప్రసంగాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు దాదాపు రోజుకో షాక్ తగులుతోంది. చంద్రబాబుతో ఇప్పటి వరకూ వెన్నంటి నడిచిన విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ టీడీపీకి రాజీనామా చేశారు. దీంతో విశాఖలో చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది. విశాఖ అర్బన్ లో టీడీపీకి రెహమాన్ బలమైన నాయకుడిగా పేరు ఉంది.

 

 

రాజీనామా చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలి. 2014లో ప్రజలు టీడీపీకి అధికారం ఇచ్చారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి రాజధాని నిర్మించలేకపోయాం. ఇప్పుడు విశాఖను రాజధాని చేసేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఈ ప్రాంత వాసులుగా దీనిని ఆహ్వానించడం తప్పా? ఇప్పటికీ మేము మేల్కోకపోతే నష్టమే. ఈ విషయంలో నేను చరిత్రహీనుడిగా మిగలదల్చుకోలేదు.. మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నిర్ణయాన్ని నేనూ వ్యతిరేకిస్తున్నా. పార్టీకి రాజీనామా చేస్తున్నా’ అని విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ స్పందించారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న రెహమాన్ త్వరలో వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది.  

 

 

రాజధాని అంశంలో చంద్రబాబు వైఖరికి వ్యతిరేక పవనాలు వీస్తూనే ఉన్నాయి. రెహమాన్ తో పాటు మరింత మంది తెలుగుదేశం నాయకులు టీడీపీని వీడతారనే వార్తలు వస్తున్నాయి. కేబినెట్ భేటీ తర్వాత టీడీపీ తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు జరుగనున్న కేబినెట్ భేటీ కీలకం కానుంది. దీంతో విశాఖ టీడీపీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అధికారికంగా ఆయన ఈ నెల 28నే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: