మీకు ఫ్రీ వైఫై ఇస్తారు. మీకే కాదు....మీ గ్రామానికి కూడా ఉచితంగా వైఫై ఇస్తారు? ఇలా దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఉచితంగా ఇస్తారు. ఇలా ఎవ‌రు ఇస్తున్నారు? ఏ ప్రైవేట్ కంపెనీ ఇస్తోంది? అని అనుకుంటున్నారా?  కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తోంది. డిజిట‌ల్ సేవ‌ల‌ను విస్తృతం చేయ‌డంలో భాగంగా ఇస్తార‌ట‌. భారత్‌నెట్‌ ద్వారా వచ్చే మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో ఉచిత వై-ఫై సేవలు అందించగలుగుతామని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ స్పష్టంచేశారు. 

 


ఇప్పటికే భారత్‌నెట్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా 1.3 లక్షల గ్రామ పంచాయితీలకు అనుసంధానం చేయగలిగామని, దీనిని 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌నెట్‌ ప్రాజెక్టు ద్వారా 48వేల గ్రామాల్లో ఉచితంగా వై-ఫై సేవలు పొందుతున్నారు. వీటితోపాటు కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్‌సీఎస్‌) ల ద్వారా బ్యాంకింగ్‌ సేవలు త్వరలో పొందవచ్చునని మంత్రి చెప్పారు. డిజిటల్‌ సేవలను మరింత విసృత పరుచడంలో భాగంగా 2014లో 60 వేల సీఎస్‌సీఎస్‌ సెంటర్లను ఏర్పాటు చేసిన కేంద్రం.. ప్రస్తుతం వీటిని 3.60 లక్షలకు పెంచుకున్నది. 

 

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో డిజిటల్‌ సేవలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సర్వీసెస్‌లకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా గ్రామాల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడంతోపాటు డిజిటల్‌ విభజనను తగ్గించడానికి వీలు పడుతున్నదని సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సీఈదో దినేశ్‌ త్యాగీ తెలిపారు. ఈ గ్రామాల స్థితిగతులు పూర్తిగా మారిపోనున్నాయని, ఆయా గ్రామాల్లో ఉన్న చిన్న చితక వ్యాపారవేత్తలను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. వీటితోపాటు విద్యా, ఆరోగ్యం, ఆర్థిక సేవల్లో గ్రామీణులను అనుసంధానం చేయడానికి వీలుపడుతుందని ఆయ‌న వివ‌రించారు.

 


ఇదిలాఉండ‌గా, దేశంలోనే మొద‌టి డిజిట్ గ్రామంగా  గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో ఉన్న అకోదర గ్రామం గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో 200 కుటుంబాలు ఉండగా 1100 మంది నివసిస్తున్నారు. వ్యవసాయం, పాల ఉత్పత్తి ఈ గ్రామం ప్రధాన ఆదాయ వనరులు. ఐసీఐసీఐ భాగస్వామ్యంతో డిజిటల్ గ్రామంగా రూపుదిద్దుకున్నది. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా ఉంది. లావాదేవీలన్నీ మొబైల్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ ఆధారంగా సాగుతున్నాయి. గ్రామస్తులందరికీ వైఫై సదుపాయం ఉంది. ఇంటిగ్రేటెడ్ ప్రొజెక్టర్ కమ్ కంప్యూటర్ ద్వారా స్మార్ట్ బోర్డ్ ఇంటరాక్టివ్ విధానంలో గ్రామంలో విద్యాభ్యాసం కొనసాగుతున్నది. ఆడియో-వీడియో పాఠ్యాంశాలను తరగతిలో ప్రదర్శిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్కూల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. విద్యార్థి హాజరు మొదలు పరీక్షల ఫలితాల వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. వైద్యం కోసం ఈ-హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: