ఏపీ సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. ఈ మేరకు అంతా రంగం సిద్ధమైంది. దీనిపై ఇక అధికారిక ప్రకటనే మిగిలింది. విశాఖను కార్యనిర్వహక రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా.. అమరావతి లెజిస్లేచర్ రాజధానిగా జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై అనేక విధాలుగా స్పందన వస్తోంది. అమరావతి రైతులు తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

 

మరోవైపు టీడీపీ నేతలు జగన్ తీరుపై మండిపడుతున్నారు. కమ్మ సామాజిక వర్గంపై కోపంతోనే విశాఖను రాజధాని చేస్తున్నారంటున్నారు. అంతే కాదు.. విశాఖ చుట్టూ భూములను వైసీపీ నేతలు హస్తగతం చేసుకున్నారని మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై విజయి సాయి రెడ్డి స్పందించారు.

 

విశాఖపట్టణంలో తాను నివాసం ఉంటున్న త్రిబుల్ బెడ్‌రూమ్ ప్లాట్ తప్ప తనకు కానీ తన కుటుంబసభ్యులకు కానీ ఆస్తులు లేవని తేల్చిచెప్పారు. విశాఖపట్టణంలో తనకు కానీ, తన కుటుంబసభ్యులకు కానీ ఎలాంటి ఆస్తులు కూడ లేవన్నారు. తన భాగస్వామ్యంలో కూడ ఎలాంటి వ్యాపారాలు కూడా లేవన్నారు విజయసాయిరెడ్డి. తనకు ఆస్తులు పెంచుకోవాల్సిన అవసరం లేదన్నారు.

 

విజయసాయిరెడ్డి విశాఖపట్టణంలో విశాఖ కలెక్టరేట్ లో విశాఖ ఉత్సవ్  ఏర్పాట్లు పై సమీక్ష  సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తన పేరు చెప్పి ఇక్కడ అధికారులపై వత్తిడి తెస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులకు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. జగన్ ఆర్థిక లావాదేవీలన్నీ విజయసాయిరెడ్డి చూసుకుంటారని ఓ టాక్ ఉంది.

 

గతంలో జగన్ కంపెనీలకు విజయసాయిరెడ్డి ఆడిటర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు వైఎస్ఆర్ సీపీలో జగన్ తర్వాత నెంబర్ టూ పొజిషన్ ఆయనదే అని చెబుతారు. మరి అలాంటి నేత పేరును దుర్వినియోగం చేసే అవకాశం మెండుగానే ఉంటుంది. అందుకే ముందుగా పోలీసులకు విజయసాయి క్లారిటీ ఇచ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: