గ్రహణం అంటేనే మన సమాజంలో ఎన్నో అపోహలు, మూఢ విశ్వాసాలు.. గ్రహణం సమయంలో గర్భిణులు బయటకు రాకూడదని.. గ్రహణ సమయంలో ఏమీ తినకూడదని.. గ్రహణం విడిచాక శాంతి చేయాలని.. ఇలా ఎన్నో చెబుతుంటారు. గ్రహణం సమయంలో చేసే తప్పుల వల్ల గ్రహణం మొర్రి పిల్లలు పూడతారని కూడా చెబుతారు. అయితే ఇప్పుడు కాస్త ఆ పరిస్థితి తగ్గింది.

 

మీడియా, టీవీలు, స్వచ్ఛంద సంస్థలు గ్రహణాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాయి. అయితే ఇంకా మూఢ విశ్వాసాలు మాత్రం పోడవం లేదు. కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన మాత్రం ఈ మూఢవిశ్వాసాలకు హైలెట్ గా చెప్పుకోవచ్చు. గురువారం దేశవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. ఉదయం 8.08 గంటలకు ప్రారంభమైన గ్రహణం.. ఉదయం11.11 గంటలకు ముగిసింది. పలుచోట్ల జాగ్రత్తలు పాటిస్తూ.. అంతరిక్ష ఔత్సాహికులు సూర్యగ్రహాణాన్ని వీక్షించారు.

 

అయితే కర్ణాటకలోని కలబురాగి జిల్లా తాజ్‌సుల్తానాపూర్‌ గ్రామంలో ఓ తల్లి మూఢ విశ్వాసంతో గ్రహణం సమయంలో తన ఇద్దరు పిల్లలను పీకల్లోకి మట్టిలో కప్పి పెట్టింది. ఎందుకంటారా.. ఆ పిల్లలు ఇద్దరూ అంగ వైకల్యంతో పుట్టారు. గ్రహణం సమయంలో ఇలా పీకల వరకూ పాతిపెడితే.. అంగవైకల్యం పోతుందని వారి నమ్మకం.. ఈ విషయం చూసి.. అంతా ముక్కున వేలేసుకున్నారు.

 

పాపం చిన్నారులు ఏడుస్తున్నా చాలాసేపు పట్టించుకోకుండా అలాగే వదిలేశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా స్థానిక అధికారులకు తెలిసింది. వెంటేనే వారు.. సంఘటన స్థలానికి వెళ్లి అడ్డుకున్నారట. అయితే దీనికంతటికీ ఓ భూతవైద్యుడు చెప్పిన సలహాయే కారణంగా తెలుస్తోంది. ఇలా ఈ ఒక్క ఊళ్లోనే కాదట. కర్ణాటకలోని చాలా గ్రామాల్లో ఇలాంటి సంఘటన జరిగాయట.

 

ఓవైపు చంద్రయానం వరకూ భారతీయులు దూసుకు వెళ్తున్నా.. సూపర్ కంప్యూటర్లు కనిపెడుతున్నా భారతీయ గ్రామాల్లో మాత్రం ఇంకా మూఢవిశ్వాసాలు పోలేదనడానికి ఈ ఘటనలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అందుకే.. ఈ టెక్నాలజీ మన పల్లెలను చేరాలి. వెలుగులు పంచాలి. అప్పుడే ఈ టెక్నాలజీకి సార్థకత.

మరింత సమాచారం తెలుసుకోండి: