ఏపీ క్యాపిటల్‌పై రేపు క్లారిటీ రానుందా? జీఎన్‌ రావు కమిటీ నివేదికను కేబినెట్‌ ఆమోదించనుందా? రాష్ట్ర ప్రజల్లో  ఆసక్తి రేపుతున్న ఈ అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే వీలుంది.

 

ముఖ్యమంత్రి జగన్‌ నేతృత్వంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌  భేటీ అవుతోంది. రైతులు, వివిధ పార్టీల ఆందోళనలు చేస్తున్న తరుణంలో మంత్రివర్గ సమావేశానికి అసాధారణ భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.  కేబినెట్‌ భేటీలో మూడు రాజధానులతోపాటు జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రధానంగా చర్చిస్తారు. ఆ నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. ఏ ప్రాంతంలో ఏమేమి ఏర్పాటు చేస్తారనే దానిపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. 

 

అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్‌ ప్లాట్లపై మంత్రివర్గంలో చర్చిస్తారు. రైతుల ఆందోళనలు , సీఆర్డీయే వ్యవహారాలపైనా చర్చ జరుగుతుంది. రైతులకు మంచి చేయాలనే సీఎం జగన్‌ ఆలోచిస్తున్నట్లు మంత్రి బొత్స చెప్పారు. అమరావతిని ఎడ్యుకేషన్‌ హబ్‌గా చేస్తామని తెలిపారు. 

 

ముఖ్యంగా రైతుల అభిప్రాయాల సేకరణకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సి.ఆర్.డి.ఎ లో ఐఏఎస్ అధికారులు కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి డబ్బులు తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. కర్నూలులో వెటర్నరీ పాలిటెక్నిక్‌ ఏర్పాటు.. పంటలకు మద్దతు ధరపై చర్చించడంతోపాటు ఏపీఐఐసీ ద్వారా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్‌ ఆమోదం తెలిపే వీలుంది. మరోవైపు-కేబినెట్‌ భేటీకి పూర్తిగా సహకరించాలని మందడం గ్రామ ప్రజలు నిర్ణయించారు. మహాధర్నా వేదికను మందడం నుంచి ఉద్దండరాయుని పాలానికి మార్చబోతున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రకటన ఇప్పటికే అమరావతి రైతుల్లో ఆందోళ చెలరేగుతోంది. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి రేపటి కేెబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: