పౌరసత్వ సవరణ చట్టం విష‌యంలో దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. దీనిపై బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తూర్పు ఢిల్లీలో వివిధ అభివృద్ధి పనులకు అమిత్‌ షా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు.  కేంద్రం చేసిన పనులను తమవిగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రచారం చేసుకుంటున్నారని అమిత్‌ షా విమర్శించారు. ఈ చ‌ట్టం విష‌యంలో వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలపై నిప్పులు చెరిగారు. సీఏఏ, ఎన్నార్సీపై ప్రజలను విపక్షాలు గందరగోళ పరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో ఆందోళనలు నిర్వహిస్తున్న తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌లను శిక్షించాల్సిన సమయం వచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ సహకారంతోనే ఈ గ్యాంగ్‌లు ఆందోళనలు నిర్వహిస్తున్నాయ‌ని అన్నారు.

 

ఆందోళనలు చేస్తున్న వారి పట్ల ఢిల్లీ ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని తగిన బుద్ధి చెప్పాలని అమిత్ షా అన్నారు. ``పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఇతర విషయాలు మాట్లాడారు. ఆ తర్వాత బయటకు వచ్చి బిల్లుపై భ్రమలు కల్పించే పని ప్రారంభించి.. ఢిల్లీలో అశాంతి నెలకొల్పారని అమిత్‌ షా తెలిపారు. ఢిల్లీలో శాంతిని నెలకొల్పే ప్రభుత్వం ఏర్పడాలా? వద్దా?` అని ఢిల్లీ వాసులను అమిత్‌ షా అడిగారు.

 

 

ఇదిలాఉండ‌గా, సీఏఏ, ఎన్నార్సీని వ్యతిరేకించేవారిని ఒక్క గంటలో తుడిచిపెట్టేస్తామంటూ హర్యానా బీజేపీ ఎమ్మెల్యే లీలారామ్‌ గుర్జర్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కైథల్‌ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా ఆయన మాట్లాడుతూ.. నేటి భారతదేశం గాంధీజీ, మాజీ ప్రధాని నెహ్రూలది కాదని ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాలది అని పేర్కొన్నారు. ‘ఇది జవహర్‌లాల్‌ నెహ్రూ హిందుస్థాన్‌ కాదు, ఇది గాంధీ నాటిదీ కాదు. ఇప్పుడున్న హిందుస్థాన్‌ నరేంద్రమోదీజీది. మహాశయా.. ఒకవేళ ఏదైనా సంకేతం లభిస్తే మాత్రం.. ఒక గంటలోపు తుడిచిపెట్టేస్తాం’ అని వ్యాఖ్యానించారు. ‘సీఏఏను తీసుకురావడం వెనుక ముస్లింలు దేశం విడిచిపోవాలనే కుట్ర దాగిఉందని ఎవరైనా భావిస్తే సరికాదు, అలాంటి ఉద్దేశం ఏదీ చట్టంలో లేదు. చట్టవ్యతిరేకంగా ఎవరైతే దేశంలోకి చొరబడ్డారో వారుమాత్రం వెళ్లకతప్పదు’ అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: