అతి దారుణంగా.. కూతురు వయస్సు ఉన్న బాలికల పై శ్రీనివాస్ రెడ్డి హత్యాచారం చేసి చంపాడు. హాజీపూర్‌ మైనర్ బాలికల అత్యాచారం, హత్య కేసు తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని గురువారం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. అలాగే మరో ఇద్దరు మైనర్ బాలికల కేసులను కూడా కోర్టు విచారించనుంది. అయితే, వాంగ్మూలం అనంతరం హత్య కేసు తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 3కు వాయిదా వేసింది.


మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో తనపై సాక్షులు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని నిందితుడు శ్రీనివాస రెడ్డి కోర్టుకు తేల్చి చెప్పాడు. అసలు ఈ కేసులతో తనకేం సంబంధంలేదని చెప్పాడు. అసలు హత్యకు గురైన మైనర్ బాలిక ఎవరో తనకు తెలియదని అన్నాడు. అంతకుముందు బాలిక మనీషా కేసుకు సంబంధించి 29 మంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను జడ్జి, నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి చదివి వినిపించారు. 


ఈ నేపథ్యంలో నిందితుడి తరపున మాట్లాడేందుకు ఎవరైనా ఉన్నారా అని కోర్టు ప్రశ్నించగా.. తన తల్లిదండ్రులు, సోదరుడ్ని సాక్షులుగా పిలిపించుకుంటానని శ్రీనివాసరెడ్డి విన్నవించుకున్నాడు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం విచారణను జనవరి 3కు వాయిదా వేసింది.


పోర్న్ వీడియోలు చూస్తావా అని జడ్జి ప్రశ్నించగా.. తన దగ్గర అసలు స్మార్ట్ ఫోనే లేదని శ్రీనివాస్ రెడ్డి సమాధానమిచ్చాడు. కర్నూలులో జరిగిన సువర్ణ హత్యతో నీకు సంబంధం ఉందా అని ప్రశ్నించగా.. అసలు సువర్ణ ఎవరో తనకు తెలీదని నిందితుడు చెప్పాడు. ‘బాలికల దుస్తులపై ఉన్న స్పెర్మ్‌, రక్తపు మరకల ఆనవాళ్లు నీవేనని ఫోరెన్సిక్‌ నివేదికలో నీవేనని తేలింది.. దీనిపై నువ్వేమంటావు’ అని జడ్జి అడగ్గా.. పోలీసులే మతలబు చేసి ఉంటారని నిందితుడు చెప్పినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: