తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఆచ‌ర‌ణ రూపం దాల్చింది. దాదాపు 52 రోజుల పాటు జ‌రిగిన ఆర్టీసీ స‌మ్మెకు ముగింపు ప‌లుకుతూ....ప్రతి ఆర్టీసీ డిపో నుంచి ఐదుగురు చొప్పున ఉద్యోగులను ప్రగతిభవన్‌కు పిలిపించి.. వారితోకలిసి భోజనం చేశారు. అనంత‌రం  ఆర్టీసీ ఉద్యోగులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాలవర్షం కురిపించారు. ఉద్యోగాలకు ఎలాంటి ఢోకాలేదంటూ భరోసానిచ్చారు. సెప్టెంబర్ వేతనాన్ని సోమవారం ఇస్తామని ప్రకటించారు. సమ్మెకాలానికి కూడా వేతనాలను తర్వాతి రోజుల్లో ఒకేదఫాలో ఇస్తామని తెలిపారు. సమ్మెకాలంలో మరణించిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లోగా ఉద్యోగం ఇవ్వడంతోపాటు, ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రిటైర్మెంట్ వయస్సును 60 ఏండ్లకు పెంచుతామని చెప్పారు. మహిళలకు రాత్రి డ్యూటీలు రద్దుచేస్తున్నట్టు చెప్పిన సీఎం.. వారికి ప్రసూతి సెలవుతోపాటు చైల్డ్‌కేర్ లీవ్ ఇస్తామని ప్రకటించారు. మహిళా ఉద్యోగులకు టాయ్‌లెట్స్‌, దుస్తులు మార్చుకునే ప్రత్యేక గదులు ఏర్పాటుచేయాలని ప్రగతిభవన్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డిపోల్లో తాత్కాలిక ప్రాతిపదికన టాయిలెట్స్‌ ఏర్పాటుచేశారు. 

 

 

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు దీర్ఘకాలం ఉండే లా పురుష, మహిళా ఉద్యోగులకు చేంజ్‌ ఓవర్‌ పాయింట్లలో సంచార బయో టాయిలెట్లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కోసం సంచార బయోటాయిలెట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. పాత బస్సుల్లో పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా టాయిలెట్లను ఏర్పాటుచేశారు. నగరంలో 9 చేంజ్‌ ఓవర్‌ పాయింట్లలో మొదట వీటిని ఏర్పాటుచేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో నేడు శామీర్‌పేటలో జరిగే వనభోజనాల సందర్భంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ బస్సులను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

`మహిళా సిబ్బంది సంక్షేమానికి కార్పొరేట్ లెవల్, రీజియన్, డిపోలవారీగా కమిటీలు వేసుకుందాం. మహిళా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆర్టీసీ వెయ్యికోట్ల లాభంలో ఉన్నప్పుడు దావత్ చేసుకుందాం. డిపో మేనేజర్లు కార్మికులతో వనభోజనాలకు వెళ్లాలి. సంతోషంగా కలిసి ఉండాలి. మీరు గొప్ప సైన్యం. సంఘటిత శక్తి. మీరు అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఆరోగ్యం బాగుంటేనే కదా పనిచేసేది. ` అంటూ వారికి కేసీఆర్ హిత‌బోధ చేశారు. తాజాగా కేసీఆర్ చెప్పిన‌వి అమ‌ల్లోకి వ‌చ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: