పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏకి) దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాలుగా స్ప‌ష్ట‌మైన చీలిక వ‌చ్చిన ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఓ ప్ర‌ముఖుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్ మాట్లాడుతూ...వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిపై  విమర్శలు గుప్పించారు. ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించేవారు నిజమైన నాయకులు కాదని ఆయన అన్నారు.

 

బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ.. ‘ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించేవారు నాయకులు కాదు. విశ్వవిద్యాలయాలు, కళాశాల విద్యార్థులు.. నగరాలు, పట్టణాల్లో ప్రజలను హింస, దహనకాండకు పురిగొల్పడం మనం చూస్తున్నాం. ఇది నాయకత్వం కాదు. నిజమైన నాయకుడు మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తాడు. సరైన సలహాలు ఇస్తాడు’ అని పేర్కొన్నారు.  అయితే రాజకీయ అంశాలపై ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల విపక్షాలు విరుచుకుపడ్డాయి. 

 

ఇదిలాఉండ‌గా, ఈ నెల 31న రావత్‌ పదవీ విరమణ చేయనున్నారు. దేశ తొలి రక్షణ దళాధిపతి(సీడీసీ)గా ఆయనను నియమిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్మీ అధిపతిగా తన మూడేండ్ల పదవీ కాలంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించలేదనే విమర్శలు రావత్‌పై ఇప్పటికే ఉన్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

 

కాంగ్రెస్‌తో సహా వివిధ ప్రతిపక్షాలు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా జనరల్‌ సాహెబ్‌. అయితే మత ఘర్షణల్లో ఊచకోతకు పాల్పడేలా అనుచరులను ప్రేరేపించేవారు కూడా నాయకులు కాదు. నాతో ఏకీభవిస్తారా జనరల్‌ సాహెబ్‌' అని ప్రశ్నించారు. హక్కుల కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ స్పందిస్తూ.. ‘నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. అవును. నాయకులు సరైన దారిలో నడిపిస్తారు. ప్రధాని మోదీని దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని నేను కచ్చితంగా చెప్పగలను’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి బ్రిజేశ్‌ కలప్ప స్పందిస్తూ.. ‘పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో ఈ విధంగా (రాజకీయ అంశాలపై సైన్యాధిపతి మాట్లాడడం) జరుగుతుంటుం ది. సీఏఏ నిరసనలపై ఆర్మీ చీఫ్‌ రావత్‌ వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్యానికి విరు ద్ధం. రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు నేడు ఆయనకు అనుమతినిస్తే, రేపొద్దున దేశంలో సైనిక పాలన ప్రయత్నానికి ఆయనకు అనుమతినిచ్చినట్లే!!’ అని ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: