రాజధానిగా విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసేశారు.  ప్రకటన మాత్రమే మిగిలింది. ఈరోజు జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసి అధికారికంగా ప్రకటన చేయటం లాంఛనమే.  ఎవరెంత గోల చేసినా జగన్ నిర్ణయంలో మార్పుండదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉగాధి పండుగకు జగన్ విశాఖపట్నం కేంద్రంగా పనిచేయటం మొదలుపెట్టటం ఖాయమని ప్రభుత్వ వర్గాలు కూడా అంటున్నాయి.

 

ఎందుకంటే సచివాలయం ఏర్పాటు,  మంత్రులలకు కార్యాలయాలు తదితరాలన్నీ ఇప్పటికే ఉన్నతాధికారులు చూసేశారు. దానికితోడు జగన్ , మంత్రులు ఇప్పటికిప్పుడు విశాఖపట్నం నుండి పనిచేయటానికి వీలుగా ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో అధునాతన భవనాలు కూడా కావాల్సినన్ని అందుబాటులో ఉన్నాయి.   కాబట్టి భవనాలను రెడీ చేసుకోవటానికి కూడా ప్రభుత్వం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉన్న భవనాలను అవసరమని అనుకుంటే వాస్తు ప్రకారం కాస్త సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది.

 

మిలీనియం టవర్స్, ఐటి సెజ్, రుషికొండ, భీమిలీ లాంటి ప్రాంతాల్లో  అవసరానికి మించిన భవనాలే చాలా ఉన్నాయి. మిలీనియం టవర్స్ ఫేజ్-1లోనే ఏడంస్తుల భవనాలు రెడీగా ఉన్నాయట.  అలాగే ఫేజ్-2 లో కూడా మరికొన్ని భవనాలు రెడీ అవుతున్నాయి. కాబట్టి వాటి నిర్మాణాన్ని స్పీడ్ చేస్తే సరిపోతోంది.  ఇక ఐటిసెజ్, రుషికొండ, భీమిలీల్లో సాఫ్ట్ వేర్ కంపెనీలకు చెందిన చాలా భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. అవసరమైతే వాటిని కూడా వాడుకలోకి తీసుకోవచ్చు.

 

 ఇక నగరానికి ఆనుకునే ఉన్న కాపులుప్పాడ, సబ్బవరం ప్రాంతాల్లో  ప్రభుత్వ భవనాలే ఉన్నాయి. అదే సమయంలో  వందలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. అవసరమైతే వీటిల్లో కావాల్సినట్లుగా భవనాలు నిర్మించుకోవచ్చు. అదే సమయంలో 10 అంతస్తుల విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటి (విఎంఆర్డిఏ) భవనం ఎలాగూ అందుబాటలోనే ఉంది.

 

అవసరమని అనుకుంటే విఎంఆర్డీఏ కార్యాలయాలను ఇక్కడ నుండి తరలించేస్తే మొత్తం 10 అంతస్తులు సచివాలయంగా బ్రహ్మాండంగా సరిపోతుంది. రాజధాని తరలింపు సాధ్యాసాధ్యాలను అన్నీ చూసుకున్న తర్వాతే జగన్ వ్యూహాత్మకంగా ప్రకటన చేశారని అర్ధమైపోతోంది. కాబట్టి రాజధాని తరలింపు తధ్యమని తేలిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: