నేడు జరగనున్న ఏపీ క్యాబినెట్ భేటీ సర్వత్ర ఉత్కంఠను రేపుతోంది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. రాజధాని అంశం, జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదికపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. మూడు రాజధానులపై మంత్రి  కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఏపి ని మూడు రాజధానులుగా చేస్తామన్నప్పటి నుంచి ఏపిలో నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి.  ఎక్కడిక్కడ వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.  ఇదిలా ఉంటే ఈ మద్య జీఎన్ రావు కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అలాగే, ఈ మంత్రి వర్గ సమావేశంలో అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక కేబినేట్ మీటింగ్ లో మూడు రాజధానుల ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడవచ్చన్న వార్తల నేపథ్యంలో, ఎక్కడ చూసినా ప్రజలు మంత్రివర్గ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలపైనే చర్చించుకుంటున్నారు.  

 

రాజధానికి భూములిచ్చిన రైతుల అంశం, వారి ఆందోళన, సీఆర్డీఏ వ్యవహారాలపై కూడా మంత్రులు చర్చించనున్నారు.  అయితే  గతం ప్రభుత్వ  పాలనలో జరిగిన అవినీతిపై ఏసీబీతో పాటు నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉప సంఘం నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ మద్య అసెంబ్లీ మీటింగ్ లో ఈ అంశంపై బీభత్సమైన చర్చలు కూడా నడిచాయి. టీడీపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ వైసీపీ నేతలు మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే.

 

 గత పాలకులు ప్రజలను మోసం చేశారని.. రైతులకు మాయ మాటలు చెప్పి భూములు కబ్జా చేశారని సీఎం ఆయన మంత్రి వర్గం ప్రతిపక్ష పార్టీ నేతలను కడిగి పడేశారు.   అమరావతి రైతులకు భరోసాను ఇచ్చేలా జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. రైతుల్లో నెలకొన్న ఆందోళనను చల్లార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశంపైనా ఆసక్తి నెలకొంది.  సీఎం జగన్ మనసులో ఏముంది..? ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబుతున్నారు అన్నది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: