ఈరోజు ఉదయం 11గంటల సమయంలో ఏపీ కేబినేట్ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన జీఎన్ రావు కమిటీ నివేదిక మరియు స్థానిక ఎన్నికల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోందని తెలుస్తోంది. కేబినేట్ ఈరోజు జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాజధాని ప్రాంత రైతుల్లో మాత్రమే కాకుండా ఏపీ ప్రజల్లో రాజధానులపై కేబినేట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా...? అనే ఉత్కంఠ నెలకొంది.
 
సమావేశంలో రాజధాని రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ గురించి చర్చ జరుగుతోందని సమాచారం. కర్నూలు జిల్లాలో వెటర్నరీ కాలేజ్ ఏర్పాటు గురించి కూడా కేబినేట్ లో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కేబినేట్ సమావేశంలో గతంలో ఆలిండియా సర్వీస్ అధికారులు భూముల కొనుగోలు కొరకు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఆలిండియా సర్వీస్ అధికారులకు చెల్లించటానికి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 
 
కేబినేట్ భేటీలో దేవాలయాలలో పాలక మండళ్ల నియామకాలు, 104 మరియు 108 వాహనాల కొనుగోలు గురించి చర్చ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్ల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఉల్లి, మిర్చి, పసుపు, చిరు ధాన్యాలకు మద్దతు ధర గురించి కూడా కేబినేట్ నిర్ణయం తీసుకోనుంది. కేబినేట్ రైతుల నుండి పంటల సేకరణకు కొత్త పాలసీని ఆమోదించనుంది. 
 
ప్రత్యేక ఎకనామిక్ జోన్ల అంశం గురించి కూడా కేబినేట్ భేటీలో చర్చ జరగనుంది. మంత్రివర్గ ఉపసంఘం కేబినేట్ భేటీకి ముందే సీఎం జగన్ తో భేటీ అయింది. మంత్రివర్గ ఉపసంఘం చంద్రబాబు పాలనలో అవినీతి గురించి సీఎం జగన్ కు నివేదికను ఇచ్చింది. విజిలెన్స్, ఏసీబీ, ఇతర నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సిద్ధం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న గత ఐదేళ్లలో ఉపాధి హామీ పనులు, రాజధాని పనులు, సాగునీటి ప్రాజెక్టులలో జరిగిన అవినీతి గురించి నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: