ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు తిరగబోయే ఘడియలు సమీపించాయి?  క్యాపిటల్‌పై కాసేపట్లో పూర్తి స్థాయి క్లారిటీ రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని గంటల ముందే మంత్రివర్గ సమావేశమైంది. దీంతో అన్ని వర్గాల్లో తీవ్ర ఆసక్తి కనిపిస్తోంది. 

 

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం సమావేశమైంది. రైతులు, వివిధ పార్టీల ఆందోళనలు చేస్తున్న వేళ... మంత్రివర్గ సమావేశానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు పూర్తిగా జాగ్రత్తలు వహించారు. మంత్రి వర్గ సమావేశంలో మూడు రాజధానులతోపాటు జి.ఎన్.రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఆ నివేదికను దాదాపుగా ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  అలాగే ఏ ప్రాంతంలో  ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారనే దానిపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. 

 

అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్‌ ప్లాట్లపై మంత్రివర్గంలో చర్చిస్తున్నట్టు సమాచారం. రైతుల ఆందోళనలు , సీఆర్డీయే వ్యవహారాలపైనా ప్రస్తావించనున్నారు.  రైతులకు మంచి చేయాలనేదే  సీఎం జగన్‌ ఆలోచనగా మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ప్రకటించారు. అమరావతిని ఎడ్యుకేషన్‌ హబ్‌గా చేస్తామని అంటున్నారు. 

 

ముఖ్యంగా రైతుల అభిప్రాయాల సేకరణకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. సీఆర్ డీఏలో ఐఏఎస్ అధికారులు కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి డబ్బులు తిరిగి చెల్లించే అంశంపైనా చర్చిస్తారని తెలుస్తోంది. ఇటు కర్నూలులో వెటర్నరీ పాలిటెక్నిక్‌ ఏర్పాటు.. పంటలకు మద్దతు ధరపై చర్చించడంతోపాటు ఏపీఐఐసీ ద్వారా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్‌ ఆమోదం తెలిపే వీలుంది. మరోవైపు-కేబినెట్‌ భేటీకి పూర్తిగా సహకరించాలని మందడం గ్రామ ప్రజలు నిర్ణయించారు. మహాధర్నా వేదికను మందడం నుంచి ఉద్దండరాయుని పాలానికి మారుస్తున్నారు. 

 

మరోవైపు ఏపీ కేబినెట్ లో ఏం చర్చిస్తున్నారనే అంశం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానుల ప్రకటన ఇప్పటికే అమరావతి రైతుల్లో ఆందోళన చెలరేగుతుంటే.. కేబినెట్ నిర్ణయం పరిస్థితులను ఎంత వరకు దారితీస్తుందనే దానిపై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: