జిల్లాల విభజనపై వస్తున్న ప్రతిపాదనలు నెల్లూరును సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఉన్న జిల్లా రెండుగా విడిపోతే వనరులు తిరుపతి జిల్లాలోకి వెళ్లే అవకాశముండగా మరో వైపు పాత ఉదయగిరి ప్రాంతం మాత్రం ఇప్పుడు తమకు ప్రత్యేక జిల్లా కావాలని అందోళనలు మొదలు పెట్టింది. అయితే ఇవన్నీ జరిగితే నెల్లూరు ప్రాధాన్యత జిరో అయ్యే అవకాశముందంటున్నారు జిల్లా వాసులు.

 

సింహపురి రెండు ముక్కలు కానుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చనున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లాను పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో రెండు జిల్లాలుగా మార్చేందుకు సీసీఎల్ ఏ, రెవెన్యూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో తిరుపతి జిల్లాగా మారే అవకాశం ఉంది. నెల్లూరు, నెల్లూరు రూరల్‌, ఆత్మకూరు, కావలి, కొవ్వూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలను నెల్లూరు జిల్లాగా మారుస్తారని తెలుస్తోంది. 

 

అయితే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. విజయనగర పాలనలో ఓ వెలుగు వెలిగిన ఉదయగిరి కేంద్రగా జిల్లాను ప్రకటించాలని ఈ ప్రాంత వాసులు ఆరు నెలలుగా ఉద్యమం చేస్తున్నారు. ఉదయగిరి కేంద్రంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని మూడు మండలాలు, కడప జిల్లా బద్వేలులోని మూడు మండలాలు ప్రకాశం జిల్లాలోని ఉదయగిరి సమీపంలోని మూడు మండలాలను కలపి నూతన జిల్లాను ప్రకటించాలని కోరుతున్నారు.  

 

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజన జరిపినట్లయితే జిల్లా ప్రాధాన్యత తగ్గిపోతుందని నెల్లూరు వాసులు అంటున్నారు. మరో వైపు గూడురు వాసులది ఇదే పరిస్థితి. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాగా ఏర్పడితే  సింహాపురి చరిత్ర కనుమరుగు కావడం తథ్యమంటున్నారు నెల్లూరు వాసులు. నెల్లూరు  జిల్లా విభజనపై కొందరు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.. !

 

మరింత సమాచారం తెలుసుకోండి: