పుర‌పాల‌క ఎన్నిక‌ల విష‌యంలో టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జనవరి 7న మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూలును రాష్ట్ర ఎన్నికలసంఘం ఇప్పటికే విడుదలచేసింది. ఈ క్రమంలో ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురవేసే విధంగా పక్కా ప్రణాళిక, వ్యూహాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఖరారుచేశారు. సీఎం వ్యూహాన్ని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అమలుచేయనున్నారు. ఈ మేర‌కు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గం భేటీ అయింది.

 

ఎన్నికల వ్యూహాలపై నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశం నుంచే మున్సిపల్‌ ఎన్నికలపై ప్రత్యక్ష కార్యాచరణకు టీఆర్‌ఎస్‌ శ్రీకారం చుట్టనున్న నేప‌థ్యంలో ప్రజల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్‌ భయపడుతోందని, తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని పేర్కొన్నారు. ``అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయి. ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. కొత్తగా పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను తీసుకొచ్చాం. తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో బ్రహ్మాండమైన విజయం సాధించాం. విపక్షాల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడినట్లుగా ఉంది.` అని ఎద్దేవా చేశారు.

 


 ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ``2014లో 63 సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్‌..2018లో 88సీట్లలో గెలిచింది. తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ అవతరించింది.  సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా ముందుకు పోతాం. ఆరు లక్షల మందికి కేసీఆర్‌ కిట్‌ అందించాం. 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం. ప్రజలకు, పార్టీకి మధ్య వారధిగా 60 లక్షల మంది గులాబీ సైనికులున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తాం. ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తాం.పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నాం. పల్లెలు, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం వచ్చిన తర్వాత గ్రామాల్లో అద్భుతమైన మార్పులు వస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా మున్సిపాలిటీలకు నిధులిచ్చాం. 95 శాతం పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయింది``అని కేటీఆర్  వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: