108.. ఇప్పుడు ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా ముందుగా గుర్తొచ్చే నెంబర్ ఇది. ఈ నెంబర్ కు కాల్ చేస్తే చాలు.. కాసేపట్లోనే అంబులెన్స్ వచ్చి సాయం అందిస్తుంది. ఇది వైఎస్ హయాంలో వచ్చిన సౌకర్యం. దీన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమల్లోకి తెచ్చారు. అంతే కాదు.. దాన్ని ఆయన ప్రచారం కూడా చేసుకున్నారు. అప్పట్లో వైఎస్ ప్రతి ఎన్నికల సభలోనూ ఈ 108 ను ప్రస్తావించేవారు.. కుయ్..కుయ్.. కుయ్.. అంటూ అంబులెన్స్ వస్తుందని చెప్పడం వైఎస్ కు అప్పట్లో ఓ అలవాటుగా ఉండేది.

 

అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ 108 సేవలు అంత సమర్థవంతంగా ఉండటం లేదు. ఈ విషయాన్ని గమనించిన జగన్ సర్కారు ఇప్పుడు దీనిపై దృష్టి సారించింది. గత ఐదు సంవత్సరాల్లో 108 అంబులెన్స్‌లన్నీ మూలనపడి టైర్లు, టైర్లలో గాలి లేక, ఇంజన్‌లో ఆయిల్‌ లేక, బండి కాలం తీరిపోయి తగలబడిపోవడం, జీతాలు లేక డ్రైవర్‌లు సమ్మెలోకి వెళ్లడంతో ఎంతోమంది ప్రాణాలు నిలపాల్సిన 108 వాహనాలకు కష్టాలు గురిచేసిన పాలన చూశామంటున్నారు మంత్రి పేర్ని నాని..

 

 

మళ్లీ వైయస్‌ఆర్‌ ఆలోచన ద్వారా వేలాది మంది ప్రాణాలు కాపాడేందుకు 412 కొత్త 108 వాహనాలు 2020 మార్చి 31 లోపు కొనుగోలు చేయడం కోసం రూ.71.48 లక్షలు కేటాయిస్తూ కొనుగోలుకు అనుమతి మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.  అలాగే ఆరోగ్య పరీక్షలు నిర్వహించే 104 నూతన వాహనాల కోసం రూ.60.51 లక్షలతో 656 వాహనాలు 2020 మార్చి 31 లోపు కొనుగోలు చేసేందుకు తీర్మానం చేయడం జరిగిందని మీడియా సమావేశంలో వివరించారు.

 

ఎవరైనా ప్రమాదాలకు గురైతే క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం లేకపోవడంతో మరణాలు సంభవించేవని.. వాటిని అరికట్టాలని, ఏదైనా ప్రమాదం జరిగిన 20 నిమిషాల్లోపు అంబులెన్స్‌ పంపించి ఆ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి చేర్చడం ద్వారా ప్రాణాన్ని నిలపొచ్చు అనే ఆలోచనతో నాడు ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 108 అంబులెన్స్‌ సర్వీస్‌ను దేశంలోనే ప్రప్రథమంగా ప్రవేశపెట్టారని పేర్ని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: