పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం సమస్యాత్మక దినం కావడంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. ఇంటర్నెట్ పై ఆంక్షలు పెట్టింది.. అయినా లెక్కచేయని ఆందోళనకారులు చట్టానికి వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉన్నారు. 

 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ మొత్తం భగ్గుమంటోంది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకూ 19 మంది చనిపోయారు. 288 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. 11 వందల మందికి పైగా అరెస్టయ్యారు. 

 

డిసెంబర్ 10వ తేదీన మొదలైన ఆందోళనలు రోజురోజుకూ అధికమవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధుల ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు లాంటి ప్రభుత్వ ఆస్తులను కూడా ఆందోళన కారులు ధ్వంసంచేశారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఘర్షణలు జరిగే ప్రమాదముందని గ్రహించిన యోగి సర్కార్ ముందస్తు నివారణ చర్యలు చేపట్టింది. 144 సెక్షన్ విధించి నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడటానికి వీల్లేదని ఆంక్షలు పెట్టింది.

 

ఉత్తరప్రదేశ్ లో మొత్తం 75 జిల్లాలుండగా 21 జిల్లాల్లో ఇంటర్నెట్ పై నిషేధం పెట్టారు. బులంద్ షహర్, ఆగ్రా, సంభాల్, బిజ్నోర్, సహరాన్ పూర్, ఘజియాబాద్, ముజఫరాబాద్, ఫిరోజాబాద్, మధుర, షమ్లి, అలీగఢ్ తదితర జిల్లాల్లో నిషేదం కొనసాగుతోంది. సోషల్ మీడియా ద్వారా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారనే నిషేధం విధించినట్లు డీజీపీ వెల్లడించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న 120 మందిని గుర్తించి 81 ఎఫ్.ఐ.ఆర్. లు నమోదు చేశామన్నారు. ఇప్పటివరకూ 7513 ట్విట్టర్ పోస్టులు, 9076 ఫేస్ బుక్ పోస్టులు, 172 యూట్యూబ్ వీడియోలపై చర్యలు తీసుకున్నారు.

 

ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే ఆ నష్టాన్ని వారి నుంచే రాబట్టాలనే రూల్ ఉత్తరప్రదేశ్ లో అమల్లో ఉంది. దీని ఆధారంగా పబ్లిక్ ప్రాపర్టీస్ ధ్వంసం చేసిన 498 మంది ఆందోళన కారుల ఆస్తులను ప్రభుత్వం సీజ్ చేసింది. వారిని సంఘ విద్రోహ శక్తులుగా పేర్కొంటూ నోటీసు జారీ చేసింది. ఇలాంటి కేసుల్లో 213 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు కాగా 925 మందిని అరెస్ట్ చేశారు. 

 

పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలకు సంబంధించి ఇప్పటివరకూ మొత్తం 327 ఎఫ్.ఐ.ఆర్.లు నమోదయ్యాయి. 5వేల 5 వందల మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్న డీజీపీ .... ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాలను డ్రోన్లతో జల్లెడ పడుతున్నట్టు చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: