వైసీపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మీటింగ్ వివరాలను మీడియాకు వెల్లడించే సమయంలో ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. తమ సర్కారుకు చెందిన మంత్రులు తప్పు చేస్తే మీ మీడియాల్లో ప్రముఖంగా రాయాలని సూచించారు. మా తప్పులు ఉంటే.. మమ్మల్ని కరెక్టు చేయండి.. మా తప్పులను బయటపెట్టండి.. మా బట్టలు ఊడదీసి నడి బజారులో నిలబెట్టండి అంటూ సవాల్ విసిరారు.

 

మీడియా ఇక ముందు ఎవరికో ఒకరికి అనుకూలంగా రాయడం మాని పరిశోధనాత్మక జర్నలిజం చేయాలని సూచించారు. వెదకండి.. మా ప్రభుత్వంలో తప్పులు ఉంటే చూపించండి.. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి.. అంటూ సలహా ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలను అన్నీ నిరూపిస్తామన్నమంత్రి.. అందుకు కొంత సమయం పడుతుందన్నారు. క్యాపిటల్‌ రీజన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి, కుంభకోణాల పరిశీలనకు ఏర్పాటుకు చేయబడిన మంత్రిమండలి ఉప సంఘం సీఎంకు నివేదికను సమర్పించింది. నివేదికలో గత ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పులు కనిపిస్తున్నాయి. నైతిక విలువలు దిగజార్చే విధంగా, అనైతికంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పులు కమిటీ కనుగొనడం జరిగిందన్నారు మంత్రి పేర్ని.

 

దీనిపై సమగ్ర దర్యాప్తు చేయడం కోసం న్యాయనిపుణుల సలహా తీసుకొని వారి సలహా మేరకు సమగ్ర దర్యాప్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు మంత్రి. సమగ్ర రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అంశాలను పరిశీలన కోసం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ రిపోర్టును మంత్రిమండలికి ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంచే ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కంపెనీల్లో ఒకటైనా బోస్టన్‌ గ్రూపుతో కమిటీ వేయడం జరిగింది. ఆ సంస్థ  రిపోర్టు ఇంకా ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఆ రెండు రిపోర్టులను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేలా ప్రభుత్వంచే హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాన్ని మంత్రిమండలి నిర్ణయించిందన్నారు మంత్రి పేర్ని.

మరింత సమాచారం తెలుసుకోండి: