కీల‌క‌మైన సంద‌ర్భంల్లో...ముఖ్య‌మైన మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఓ వైపు 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ స‌న్నాహాలు జ‌రుగుతుండటం....మ‌రోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకు ల ఆర్థిక స్థితిగతులు, పనితీరు, వ్యాపారంలో వృద్ధి తదితర అంశాల‌పై సందేహాలు క‌మ్ముకుంటున్న త‌రుణంలో...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఆయా బ్యాంకుల అధిపతులతో సమావేశం కాబోతున్నారు.  డిమాండ్, వినిమయంలో బ్యాంకింగ్ రంగ పాత్ర చాలా కీలకంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే వినియోగ‌దారుల‌కు కొత్త అంచ‌నాల‌ను క‌ల్పిస్తోంది. 


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశానికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎండీ, సీఈవోలు హాజరుకాబోతున్నారు. ఈ సమావేశంలో మొండి బకాయిల వసూళ్లకు సంబంధించి బ్యాంకులు తీసుకుంటున్న చర్యలు, అలాగే దివాలా చట్టం కింద ఎన్ని కేసులు పరిష్కరించిన దానిపై కూడా ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. గడిచిన నాలుగేళ్ల‌లో పీఎస్‌బీలు రూ.4,01,393 కోట్ల మొండి బకాయిలను వసూలు చేయగలిగాయి. వీటిలో 2018-19 లోనే రూ.1,56,702 కోట్లు రికవరి చేశాయి. రిజర్వు బ్యాంకు పలుమార్లు వడ్డీరేట్లను తగ్గించినప్పటికీ ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు ఖాతాదారులకు చేరవేయడం లేదన్న ఆరోపణలపై కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 2019లో ఇప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను 110 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు తొమ్మిదేండ్ల కనిష్ఠ స్థాయి 5.40 శాతానికి తగ్గింది. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో భారత వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్ఠ స్థాయి 4.5 శాతానికి పడిపోగా, భవిష్యత్తులోనూ మరింత పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.


ఇదిలాఉండ‌గా, ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గ‌త‌ గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను వ్యాపార, పారిశ్రామిక వర్గాలతో స‌మావేశం అయ్యారు. భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్, అసోచామ్ అధ్యక్షుడు బాల్‌కృష్ణ గోయెంకా, ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమని, పలు సంస్థల ప్రతినిధులతో స‌మావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పురోగతికి చర్యలు చేపట్టాలని, అప్పుడే వ్యాపార, పారిశ్రామిక రంగాలకు మరింత స్వేచ్ఛ లభించగలదని సూచించారు. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఒక్కటే. దేశంలో వ్యాపార నిర్వహణను సులభం చేయాలి అని సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్న సునీల్ మిట్టల్ స్పష్టం చేశారు. భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు మరింత స్వేచ్ఛ అవసరమని, అప్పుడే ఇండస్ట్రీ శక్తి, సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యాపార నిర్వహణకు మరింత అనుకూలమైన పరిస్థితులను తీసుకురావాలని కేంద్రానికి సూచించామ‌న్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: