హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో నిర్ణయించిన రుసుం చెల్లించి  ఈ రిక్షా లో విద్యార్థులు ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు . ఇప్పటి వరకు క్యాంపస్ లో విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యం ఉండేది . అయితే ఆ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే , ఈ రిక్షా లను క్యాంపస్ లో ప్రవేశపెట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులు , ఫ్యాకల్టీ కలిపితే ఆరువేల మంది వరకు ఉంటారు . అందరికి మెరుగైన  రవాణా సేవలను అందించాలన్న  ఉద్దేశ్యం తో సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం , ఈ రిక్షాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది .

 

ఈ రిక్షాలను సమకూర్చే బాధ్యతను  బెంగళూరు కు చెందిన ఒక ప్రయివేట్ సంస్థ అప్పగించింది .  సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులు ,ఫ్యాకల్టీ , సందర్శకులు ఎవరైనా ఈ రిక్షాలను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది . అయితే ఈ రిక్షా ల ఏర్పాటును విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . క్యాంపస్ లో ఈ రిక్షాలలో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు . విద్యార్థుల పై ఆర్థికభారం మోపుతామంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు . విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి , ఇతరుల వద్ద రుసుం వసూలు చేసిన తమకు అభ్యంతరం లేదని అంటున్నారు .

 

విద్యార్ధులపై ఆర్ధిక భారం మోపే ఏ నిర్ణయాన్ని తాము అంగీకరించేది లేదని అంటున్నారు . ఈ విషయమై ఇప్పటికే రిజిస్ట్రార్ , డిప్యూటీ రిజిస్ట్రార్ కు వినతి పత్రాలను అందజేశామని, త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని విద్యార్థి సంఘం నేతలు చెబుతున్నారు  . లేనిపక్షం లో వర్శిటీ లో ఈ రిక్షాలను తిరగనిచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు . క్యాంపస్ లో ఉచిత బస్సు ట్రిప్పుల సంఖ్య పెంచాలని తాము కోరితే ఆర్ధిక భారాన్ని మోపే ఈ రిక్షాలను ప్రవేశపెట్టారని విద్యార్థులు మండిపడుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: