పండిత పుత్ర పరమ శుంఠ  అన్నట్టుగా తయారయింది టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పరిస్థితి. తన రాజకీయ వారసుడిగా చినబాబు లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే తన స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పుతాడని చంద్రబాబు భావించగా లోకేష్ మాత్రం ఆ స్థాయిలో తనను తాను నిరూపించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇక టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో లోకేష్ బాబు చక్రం తిప్పారు. చంద్రబాబు తర్వాత అన్ని తానే అన్నట్టుగా తన పలుకుబడిని పెంచుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలోనే పార్టీ నాయకుల ఆగ్రహానికి , అసంతృప్తికి చిన్నబాబు కారణం అయ్యారనే విషయాన్ని అటు బాబు కానీ ఇటు లోకేష్ కానీ గుర్తించేలేకపోయారు.


 పార్టీలో పెత్తనం చేయాలనే ఉద్దేశంతో లోకేష్ నాయకులను ఆయన చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇక ప్రతిపక్షాలు అయితే అప్పట్లో ఒక ఆట ఆడుకున్నాయి. లోకేష్ బాబు ప్రసంగంలోని తప్పులను వెతికి పట్టుకుని, ఆయన రాజకీయాలకు పనికిరాడు అనే విధంగా బాగా ప్రచారం చేసాయి. ప్రజా క్షేత్రంలో నిలబడే దమ్ము లేక దొడ్డిదారిన ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారంటూ ఒక రేంజ్ లో విమర్శలు చేయడంతో 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ బరిలోకి దిగాడు. అయితే అక్కడ ఆయనకు పరాజయమే పలకరించింది. టిడిపి అధికారానికి దూరమవడంతో పాటు నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళుతూ చిన్న బాబు లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. 


తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితి పట్టడానికి కారణం లోకేష్ అన్నట్టుగా బయటకు వెళ్ళిపోతున్న నాయకులందరూ విమర్శలు చేస్తున్నారు. మొన్న టిడిపి నుంచి బయటికి వెళ్లిపోయిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ లోకేష్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా, ప్రస్తుతం విశాఖకు చెందిన మాజీ మంత్రి రహమాన్ అదే స్థాయిలో కామెంట్లు చేశారు. తెలుగుదేశం పార్టీకి ఆయన రాజీనామా చేసిన తర్వాత లోకేష్ వ్యవహారాలను బయటపెట్టారు. తెలుగుదేశం పార్టీలోకి లోకేష్ వచ్చిన తర్వాత పచ్చని పార్టీ కాస్త మోడుగా మారిపోయిందని విమర్శించారు. పార్టీ నాయకులకు అధినేత చంద్రబాబుకు మధ్య లోకేష్ అడ్డుగోడగా మారారని, లోకేష్ కు  రాజకీయ మేధస్సు లేకపోయినా పార్టీని శాసిస్తూ మనుగడని దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శలు చేస్తున్నారు. 


లోకేష్ ను జగన్ తరహాలో సమర్థవంతమైన నాయకుడిగా తయారుచేయాలని చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ నాయకులే ఇలా ఆయనను అసమర్దుడిగా, పార్టీని నాశనం చేసే వ్యక్తిగా చూస్తూ ఉండడం చంద్రబాబులో మరింత అసహనాన్ని కలిగిస్తోంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు వయసు రీత్యా రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయంలో సమర్ధుడైన రాజకీయ వారసుడు లేకపోవడం, లోకేష్ నాయకత్వం పై పార్టీ శ్రేణులకు నమ్మకం లేకపోవడం చంద్రబాబును మరింత  కుంగదీస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: