జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై ఎంత గోల జరుగుతోందో అందరికీ తెలిసిందే.  రాష్ట్రాభివృద్ధికి మూడు రాజధానులు అవసరమని జగన్ అసెంబ్లీలో చెప్పినట్లుగానే తర్వాత జీఎన్ రావు  కమిటి కూడా తన నివేదికలో  చెప్పింది. అయితే ఈ విషయమై శుక్రవారం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవాల్సున్నా తీసుకోలేదు. ఎందుకంటే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బిసిజి) నివేదిక  రాగానే పరిశీలిద్దామని జగన్ చెప్పటంతో నిర్ణయం అమలు వాయిదా పడింది.

 

ఇంతకీ బిసిజి అంటే ఏమిటి ? బిసిజి అనే కన్సల్టెన్సీ కంపెనీ అమెరికాకు చెందినది. ఈ కంపెనీకి  50 దేశాల్లో 90కి పైగా కేంద్రాలున్నాయి. కన్సల్టెన్సీలో ఈ కంపెనీకి మంచి పేరు ప్రఖ్యాతులే ఉన్నాయి. అటువంటి కంపెనీకే రాజధాని ఏర్పాటు విషయంలో సమగ్రమైన నివేదికను అందించే బాధ్యత జగన్ అప్పగించారు.

 

అయితే ఇప్పటికే బిసిజి తన మధ్యంతర నివేదికను అందించినట్లు సమాచారం. కాకపోతే పూర్తిస్ధాయి నివేదిక జనవరి 3వ తేదీకి వస్తుందని అంచనా వేస్తున్నారు.  మధ్యంతర నివేదికలో  రాజధానిగా అమరావతి ఎంతమాత్రం  ఉపయోగం లేదని అంచనా వేసిందట. ఎలాగంటే రాజధాని నిర్మాణానికి పెట్టాలన్న ఖర్చుతో  పోల్చుకుంటే దాని ద్వారా వచ్చే ఆదాయాలు ఏమూలకు సరిపోవని స్పష్టంగా చెప్పిందట.  లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేసి గ్రీన్ ఫీల్డ్ రాజధానిని నిర్మించటం కన్నా ఇప్పటికే అభివృద్ది చెందిన బ్రౌన్ ఫీల్డ్ రాజధానిని ఎంపిక చేసుకోవటమే మంచిదని అభిప్రాయపడినట్లు సమాచారం.

 

అయితే బ్రౌన్ ఫీల్డ్ రాజధానిగా దేనిని ఎంచుకోవాలని మాత్రం చెప్పలేదు. నిజానికి రాష్ట్రం మొత్తం  మీద రాజధాని అవటానికి అర్హతలు, హంగు, అవకాశాలు విశాఖపట్నంకు మించిన నగరం లేదని అందరూ ఒప్పుకుంటున్నారు. అందుకనే జగన్ కూడా విశాఖనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రతిపాదించారు.  పక్కనే ఉన్న విజయవాడ విస్తరణకు ఉన్న ఇబ్బందులను కూడా ప్రస్తావించింది.  ఒకవైపు కృష్ణానది, మరోవైపు చుట్టూఉన్న కొండల వల్ల అభివృద్ధి సాధ్యం కాదని బిసిజి తేల్చేసింది. ఎందుకంటే భూమి లభ్యత కూడా లేదు.

 

 ఇప్పటి అమరావతిని విజయవాడతో అనుసంధానించటానికి నదిపై బ్రిడ్జిలు నిర్మిస్తే సరిపోతుందని కూడా తన మధ్యంతర నివేదికలో చెప్పిందట. మరి జనవరి 3వ తేదీన వచ్చే పూర్తిస్ధాయి నివేదికలో ఇంకేమి చెబుతుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: