కింద పడ్డ పైచేయి నాదే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. మొదటి నుంచి ఆయన వ్యవహార శైలి ఈ విధంగానే ఉంటూ వస్తోంది. ప్రస్తుతం మూడు రాజధానుల అంశంపై ఏపీ క్యాబినెట్ మరికొంత కాలం వేచి చూడాలనే  నిర్ణయానికి రావడం, అది కాకుండా అమరావతి పరిసర ప్రాంతాల్లో రైతులు దీనిపై ఆందోళన చేస్తుండడం జగన్ ను ఆలోచనలో పడేసింది. అందుకే ఈ వ్యవహారంపై కాస్త వెనక్కి తగ్గారు. శుక్రవారం క్యాబినెట్ మీటింగ్ అనంతరం ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకుండా వాయిదా వేయడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల ప్రజలు కాస్త అసహనం వ్యక్తం అయినట్టుగా కనిపించింది.


 రాజధానిపై జీఎన్ రావు కమిటీతో పాటు మరో కమిటీ నివేదిక వచ్చాక దానిపై హైపవర్ కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్నిబట్టి ప్రభుత్వం రాజధాని అంశంఫై కాస్త వెనక్కి తగ్గినట్లుగా అందరికీ అర్థం అయిపోయింది. అయితే ఇక్కడే చంద్రబాబు తన రాజకీయ మేధస్సుకు పదును పెట్టాడు. ప్రభుత్వం వెనక్కి తగ్గడం వెనుక క్రెడిట్ అంతా తనదే అన్నట్లుగా బాబు వ్యవహరించారు. కేబినెట్ భేటీలో దీనికి సంబంధించి సమాచారం బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగిపోయారు. ప్రభుత్వం వెనక్కి తగ్గడం వెనుక నేనే కారణం అన్నట్టుగా ఆయన మీడియా సమావేశంలో హడావుడి చేశారు. కానీ జగన్ మూడు రాజధానుల అంశం అసెంబ్లీలో ప్రకటించిన తరువాత నుంచి చంద్రబాబు ఎక్కడా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. రాజధాని అంశంపై పది రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నా చంద్రబాబు అక్కడకు వెళ్లి సంఘీభావం ప్రకటించలేదు.


 అసలు జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు గట్టిగా ఆ వాదనను వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు ప్రభుత్వం వేసిన వెనకడుగు టీడీపీ ఖాతాలో పడి ఉండేది. కానీ అప్పుడు మూడు రాజధానుల అంశంపై ఏమి చేయాలో తెలియని గందరగోళ పరిస్థితులు చంద్రబాబు ఉండిపోయాడు. మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడితే కృష్ణ, గుంటూరు జిల్లాలో టిడిపి పై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అలాగని ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో టిడిపి ఇబ్బందికర పరిస్థితుల్లో పడుతుంది. అసలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో నాయకులు మూడు ప్రాంతాల వారీగా విడిపోయి ఎవరికి వారు తమ వాదన వినిపిస్తున్నారు. 

 

ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ముందడుగు వేయలేక, వెనకడుగు వేయలేక పది రోజులుగా బాగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎప్పుడైతే రాజధానిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదని తెలిసిందో అప్పుడే చంద్రబాబు గంభీరంగా స్పందించడం మొదలుపెట్టారు. కానీ జగన్ వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళన అని తెలుస్తోంది. ఈ విషయంలో పది రోజులుగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులే ఇప్పుడు విజయం సాధించారు అని అనుకోవాలి తప్ప ఆ క్రెడిట్ అంతా తన వల్లే అనుకోవడం చంద్రబాబు  రాజకీయ అవకాశవాదానికి నిదర్శనంగా కనిపిస్తోంది అనే విమర్శలు ఎక్కువయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: