మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్రలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బిజెపి శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఆ తర్వాత బిజెపి శివసేన కూటమి విబేధించింది. ఆ తర్వాత శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ అనుకోగా రాత్రికి రాత్రి మంతనాలు జరిపి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత బలనిరూపణ చేసుకోలేక బిజెపి ప్రభుత్వం కుప్పకూలిపోగా శివసేన పార్టీ ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఈ పదవిని చేపట్టారు. అయితే బిజెపి ప్రభుత్వం కూలిపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం కర్ణాటక రాజకీయమే మహారాష్ట్రలో రిపీట్ అవుతుందని కొంత మంది భావించారు. 

 

 

 మూడు పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో విభేదాలు తలెత్తుతాయని పలువురు భావించారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో థాక్రే  కుటుంబం నుంచి తొలిసారిగా ఓ వ్యక్తి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇకపోతే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో ఏర్పాటైన ఈ సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే అసంతృప్తి ప్రారంభం అయిందని మహా రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. వాస్తవానికి అయితే స్పీకర్ పదవిని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టి హోం మంత్రి పదవిని శివసేన తీసుకోవాలని భావించింది . కానీ హోం మంత్రి పదవిని ఎన్సీపీకి ఇచ్చేందుకు తాజాగా శివసేన సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపీ పార్టీకి తగిన ప్రాధాన్యత లభించినట్లయింది. 

 

 

 

 అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం తగిన ప్రాధాన్యత లభించడం లేదని కాంగ్రెస్ నేతలందరూ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. శివసేన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వజూపిన పదవుల పట్ల కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పరిశ్రమలు గ్రామీణ అభివృద్ధి సహకార వ్యవసాయ శాఖ లను కాంగ్రెస్ ఆశించినట్లు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రాధాన్యత లేని ప్రజలతో నేరుగా సంబంధాలు కూడా కలిగి ఉండని శాఖలను ఇవ్వాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయించారట. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశకు గురై అసంతృప్తి పెరుగుతోందని  మహా రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. శివసేన కాంగ్రెస్ ఎన్సిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులైనా గడవకముందే అసంతృప్తి జ్వాలలు మొదలవడంతో.. సంకీర్ణ ప్రభుత్వం ఎన్ని రోజులు మనుగడ సాగిస్తుంది అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: