ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు ఉండొచ్చంటూ 
ప్రకటన చేసిన రోజు నుండి రాజధానుల గురించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ముఖ్యంగా అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు తమ ప్రాంతం నుండి రాజధాని తరలిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కర్నూలు, విశాఖ వాసులు మాత్రం మూడు రాజధానుల నిర్ణయం గురించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ది హిందూ బిజినెస్ లైన్ అనే వెబ్ సైట్ జగన్ మూడు రాజధానుల ప్రకటన గురించి పోల్ నిర్వహిస్తోంది. ఏపీకి మూడు రాజధానులు ఉండాలన్న జగన్ నిర్ణయాన్ని తెలివైన చర్యలా భావించాలా..? అనే ప్రశ్నతో పోల్ నిర్వహిస్తోంది. ఈ ప్రశ్నకు అవును.. కాదు.. చెప్పలేము అనే మూడు ఆప్షన్లను ఇచ్చింది. 
 
సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన గురించి ఈ వెబ్ సైట్ లింక్ https://www.thehindubusinessline.com/news/national/Todays-Poll/article30403775.ece క్లిక్ చేసి పోల్ లో పాల్గొన్ని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. మరోవైపు నిన్న జరిగిన కేబినేట్ భేటీలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. కేబినేట్ భేటీలో జీఎన్ రావు నివేదికపై చర్చ జరిపిన మంత్రివర్గం బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్టు అందాల్సి ఉందని రిపోర్ట్ వచ్చాక ప్రభుత్వం ఏర్పాటు చేసే హైపవర్ కమిటీ రిపోర్ట్ ను పరిశీలించి అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. 
 
బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక జనవరి 3వ తేదీన వచ్చే అవకాశం ఉందని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వైసీపీ ప్రభుత్వం రాజధానిని గందరగోళంలోకి నెడుతోందని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ పరిపాలనా వికేంద్రీకరణ వలన ఉపయోగం లేదని అన్నారు. జగన్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని దేశంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ తరువాత ప్రభుత్వం రెండు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రాజధానుల గురించి నిర్ణయం ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: