తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న కీల‌క‌మైన వివాదంలో క్లారిటీ వ‌చ్చింది. ఐదేళ్లుగా ఇరురాష్ర్టాల మధ్య ఉప్పునిప్పులా మారిన విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్య ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. నాలుగేళ్ల‌పాటు హైకోర్టు ఆపై సుప్రీంకోర్టుకు నడిచిన వివాదానికి ముగింపు ప‌డింది.

 


ఆంధ్రా స్థానికత ఉన్న ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడంపై ఉద్యోగసంఘాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నా.. కనీసం ఇప్పటికైనా సమస్యను పరిష్కరించారనే ఊరట కూడా కనపడుతున్నది. సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిటీ జస్టిస్‌ ధర్మాధికారి.. పలుమార్లు ఇరురాష్ర్టాల ప్రభుత్వ ప్రతినిధులు, విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగసంఘాల ప్రతినిధులు, ఉద్యోగులతో సమావేశమై అన్ని అంశాలను పరిశీలించి దాదాపు ఏడాది తర్వాత శుక్రవారం తన తుది నివేదికను ఇచ్చారు. 

 

ఆంధ్రా స్థానికత ఉన్న 1,157 మందిని తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి రిలీవ్‌చేస్తూ తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రా విద్యుత్‌ యాజమాన్యాలు గగ్గోలు పెట్టాయి. చివరకు సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు జస్టిస్‌ ధర్మాధికారితో ఏకసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. ఆయన విద్యుత్‌ ఉద్యోగుల విభజన పూర్వాపరాలు, రెండు రాష్ర్టాల వాదనలను లోతుగా విశ్లేషించారు. సబ్‌కమిటీతో సమావేశాలు, న్యాయపరమైన అంశాలు, రాష్ట్ర పునర్విభజన చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పేర్కొం టూ.. తుది నివేదికను సిద్ధంచేశారు. ఇందులో 1,157 మంది ఉద్యోగుల విభజనే కీలకంగా మారిన అంశాన్నికూడా పేర్కొన్నారు. అనుబంధంగా కమిటీ దృష్టికి తీసుకొచ్చిన అంశాలనుకూడా జస్టిస్‌ ధర్మాధికారి తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. కొన్నిఅంశాల్లో సబ్‌కమిటీ విభేదించిన అంశాలనుకూడా ఉటంకించారు.

 

కాగా, వివాదం తలెత్తిన 1157 మంది విద్యుత్‌ ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు ఆప్షన్లు ఇచ్చిన 613 మంది ఉద్యోగులను ఏపీకే కేటాయిస్తూ జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ నిర్ణయించింది. ఇక తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 502 మందిని తెలంగాణ విద్యుత్‌సంస్థలకు కేటాయించింది. వాస్తవానికి ఆంధ్రా స్థానికత అయినప్పటికీ.. వివాదాన్ని పరిష్కరిద్దామనే ఆలోచనతో తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 502 మందిని తీసుకొనేందుకు ముందుకొచ్చాయి. ఏపీకి ఆప్షన్‌ ఇచ్చిన 613 మందిని తీసుకోవాల్సిందేనంటూ తేల్చిచెప్పాయి. అలాగే ఎలాంటి ఆప్షన్‌ ఇవ్వని 42 మందిని కూడా ఏపీకే కేటాయించారు. ఇదిలాఉండగా.. ఏపీ నుంచి తమంతట తాముగా రిలీవ్‌ అయి తెలంగాణకు వచ్చిన 242 మందిని జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ తెలంగాణకే కేటాయించింది. సంప్రదింపులు, సమావేశాల చివరి సమయంలో ఏపీ కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన 256 మంది ఉద్యోగుల విషయాన్ని కమిటీ పరిగణనలోకి తీసుకోనట్టే. ఈ 256 మంది తెలంగాణకు ఆప్షన్‌ ఇచ్చినా ఏపీలో పనిచేస్తుండటం, కమిటీ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో వారంతా ఏపీకే చెందుతారనేది స్పష్టమయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: