తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో....ప్ర‌త్యేక రాష్ట్ర ఆకాంక్ష‌ను మిలియ‌న్ మార్చ్ రూపంలో చాటి చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే, స‌రిగ్గా అదే రూపంలో ప్ర‌జ‌ల కోణంలో...హైద‌రాబాద్ వేదిక‌గా మ‌రో మిలియ‌న్ మార్చ్‌కు స‌న్నాహాలు సిద్ధ‌మ‌య్యాయి. అయితే,ఈ నిర‌స‌న రూపానికి రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయస్థానం అనుమ‌తి నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ప్రతిపాదిత ఎన్నార్సీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో పలు సంఘాలు తలపెట్టిన మిలియన్‌మార్చ్‌ నిరసన ర్యాలీకి అనుమతించేందుకు హైకోర్టు శుక్రవారం నిరాకరించింది.

 

 

నేడు మిలియన్‌మార్చ్‌ నిర్వహించేందుకు తమకు అనుమతివ్వాలంటూ టీఎస్‌- ఏపీ సీఏఏ, ఎన్నార్సీ జేఏసీ కన్వీనర్‌ మహమ్మద్‌ ముస్తాక్‌మాలిక్‌ ఈ నెల 21న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు దరఖాస్తు చేశారు. దీనిని పోలీసులు తిరస్కరించడంతో జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. శాంతియుత ర్యాలీకి అనుమతించేలా ఆదేశాలివ్వాలని, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కులో పోలీసులు జోక్యం చేసుకోకుండా చూడాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. దరఖాస్తును పోలీసులు పెండింగ్‌లో పెట్టలేదని, తిరస్కరించారని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దరఖాస్తును తిరస్కరించడాన్ని పిటిషినర్లు సవాల్‌ చేయనందున దాని ని కొట్టేయాలని కోరారు. పోలీసులు భద్రత కల్పించకుండా కార్యక్రమం నిర్వహించలేరని పేర్కొన్న ధర్మాసనం.. పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్‌చేస్తూ సవరణ పిటిషన్‌ దాఖలుచేయాలని సూచించింది. విచారణను మంగళవారానికి వాయిదావేసింది. పిటిషన్‌లో పేర్కొన్న ప్రేయర్‌లో లోపాలు ఉన్నందున దానిని సవరించి, మళ్లీ దాఖలుచేయాలని జస్టిస్‌ టీ వినోద్‌కుమార్‌ ధర్మాసనం సూచించింది. 

 


మ‌రోవైపు, మిలియన్‌మార్చ్‌కు అనుమతించేలా ఆదేశాలివ్వాలని ఖలీల్‌ ఉల్లాహ్‌ హుస్సేని మెమోరియల్‌ ఫౌండేషన్‌ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలుచేసింది. పోలీసులకు దరఖాస్తు చేసినవ్యక్తి, ఖలీల్‌ఉల్లాహ్‌ హుస్సేని మెమోరియల్‌ ఫౌండేషన్‌ వేర్వేరు అయినందున మిలియన్‌మార్చ్‌కు అనుమతివ్వాలని కోరేందుకు ఫౌండేషన్‌కు ఎలాంటి లోకస్‌స్టాండీ (అర్హత) లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఒకే అంశంపై వేర్వేరు పిటిషన్లు వేయడాన్ని తప్పుబట్టింది. మాలిక్‌ దరఖాస్తును తిరస్కరిస్తూ పోలీసులు ఇచ్చిన ఉత్తర్వులను మీరెలా సవాల్‌చేస్తారని ప్రశ్నిస్తూ.. రెండో పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు వెలువ‌రించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: