ఏదైనా వస్తువును పోగొట్టుకున్నా, ఎవరి చేతిలోనైనా మోసపోయినా, దొంగతనం జరిగినా బాధితులు న్యాయం చేస్తారనే ఆశతో పోలీస్ స్టేషన్ కు వెళతారు. కానీ బాధితులు చాలా మంది కంప్లైంట్ తీసుకోవటం లేదని, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయటం లేదని ఏదో ఒక సమాధానం చెప్పి పంపించివేస్తున్నారని చాలా సందర్భాలలో చెబుతూనే ఉంటారు. ఈ విషయం నిజమో కాదో తేల్చటానికి ఏకంగా ఒక ట్రైనీ ఐపీఎస్ సామాన్యుడిలా రంగంలోకి దిగాడు. 
 
నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒంగోలు తాలుకా పరిధిలోని ఒక స్టేషన్ లో బాధితుడి రూపంలో ట్రైనీ ఐపీఎస్ సరాసరి రైటర్ రూమ్ లోకి వెళ్లాడు. రైటర్ ఎవరు మీరు... ఏం కావాలని ప్రశ్నించగా నా ఫోన్ పోయిందని ఫిర్యాదు తీసుకోవాలని అడిగాడు. సిబ్బంది ఫిర్యాదు రాయమని అడగగా ఫిర్యాదు రాసి ఇచ్చి ఎఫ్‌ఐఆర్‌ కాపీ కావాలని అడిగాడు. పోలీసులు అతనిని మీది ఏ వూరు...? ఇక్కడికి ఎందుకు వచ్చావు...? అని ప్రశ్నించారు.
 
తనది బెంగళూరు అని స్నేహితులతో కలిసి ఒంగోలుకు వచ్చానని ఆర్టీసీ బస్టాండులో వాకింగ్ చేస్తుంటే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ లాక్కొని వెళ్లిపోయాడని అతను సమాధానం ఇచ్చాడు. అక్కడ ఉన్న హెడ్డు నగరంలో సీసీ కెమెరాలు ఉన్నాయని పరిశీలిస్తామని నీది తప్పని తేలితే ఏం చేయమంటావని ప్రశ్నించారు. బాధితుడుగా వచ్చిన అతను 45 నిమిషాల పాటు నిలబడే ఉన్నా అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు. బాధితుడు చూసీ చూసీ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు రాగానే పోలీసు వాహనం రాగా ఆ వాహనంలో బాధితుడి రూపంలో వచ్చిన ట్రైనీ ఐపీఎస్ జగదీష్ అక్కడినుండి వెళ్లిపోయారు. 
 
ట్రైనీ ఐపీఎస్ జగదీష్ ఎస్పీ సిద్దార్థ కౌశల్ కు స్టేషన్ లో తనకు ఎదురైన పరిస్థితిని వివరించారు. 45 నిమిషాల పాటు స్టేషన్ లో ఉన్నా సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదని బాధితుల పట్ల స్టేషన్ సిబ్బంది వ్యవహారశైలి అత్యంత దారుణంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బాధ్యుడైన రైటర్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లకు తాఖీదులు జారీ చేశారు. వీరిలో కొందరిని సస్పెండ్ చేయగా మరికొందరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు ఎస్పీ కౌశల్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు ఇదే రీతిన వ్యవహరిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: