యూటర్న్.. ఇప్పుడు ఈ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒకే ఒక నేత చంద్రబాబు అన్నట్టుగా పరిస్థితి తయారైందని మీడియా సర్కిల్లో జోకులు పేలుతున్నాయి. మొన్న కేబినెట్ మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ మంత్రి పేర్ని నాని.. ఓ విలేఖరితో జోక్ చేస్తూ.. యూటర్న్ అని మీరు పదేపదే అన్నారనికోండి.. మీపై కాపీరైట్ యాక్టు కింద కేసు పెట్టే ప్రమాదం ఉంది..ఎందుకంటే.. ఈ పదం మీద చంద్రబాబు పేటెంట్ తీసుకున్నట్టున్నారు అంటూ కామెడీ చేశారు.

 

చూడటానికి కామెడీగా ఉన్నా సీరియస్ గా కూడా పరిస్థితి అలాగే ఉందంటున్నారు మీడియా విశ్లేషకులు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు కూడా చంద్రబాబుని మించిపోయారని సెటైర్లు వస్తున్నాయి. ఎందుకంటే.. అమరావతి విషయంలో చంద్రబాబు ఎంత పబ్లిసిటీ చేశారో అందరికీ తెలిసిందే. లక్షల కోట్లు వెచ్చించి అమరావతి నిర్మిస్తామని ఆయన ఎన్నో సార్లు మీడియా ముందే చెప్పారు. అయితే ఇప్పుడు జగన్ ఏకంగా రాజధానిని విశాఖకు తీసుకెళ్తుండటంతో టీడీపీ రూట్ మార్చేసింది.

 

రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు చేయలేమంటూ జగన్ సాకు చూపుతున్నారని.. కానీ.. అంత ఖర్చు అవసరం లేదని ఇప్పుడు టీడీపీ నేతలు ప్లేటు ఫిరాయించేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాటలు చూస్తే అలాగే ఉంది మరి. రాజధాని అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల పైబడి నిధులు అక్కర్లేదని ఆయన ఇప్పుడు అంటున్నారు. స్వయంపోషిత ప్రాజెక్టుగా ఎలా అభివృద్ది చేయవచ్చో మాస్టర్ ప్లాన్ లోనే ఉందని ఆయన అంటున్నారు.

 

53 వేల ఎకరాల ద్వారా సంపద సృష్టి ఎలా సాధ్యమో తెలుసుకుంటే చాలని కనకమేడల అంటున్నారు. ఏకాభిప్రాయం తీసుకున్నాకే అమరావతిలో రాజధానికి శ్రీకారం చుట్టారని, అధికారంలోకి రాగానే జగన్ తన విధానం మార్చుకున్నారని కనకమేడల అంటున్నారు. అయితే.. గతంలో రాజధానిలో ఎకరా అబివృద్దికి రెండు కోట్ల రూపాయల చొప్పున డబ్బు కావాలని తెలుగుదేశం చెప్పిన లెక్కలను జనం అంత సులభంగా మరచిపోతారా..

మరింత సమాచారం తెలుసుకోండి: