స‌హ‌జంగా ఆందోళ‌న‌ల‌కు, నిర‌స‌న‌ల‌కు దూరంగా ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. ఏకంగా కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా గ‌లం వినిపించారు. ఏకంగా బ‌హిరంగ లేఖ రాశారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు చెందిన నిపుణులు, ఉద్యోగులు ఘాటుగా స్పందించారు. ఈ చట్టాన్ని ‘ఫాసిస్టు (నియంతృత్వ) చట్టం’గా అభివర్ణిస్తూ కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ‘మీడియం’ అనే సోషల్‌మీడియా వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఈ లేఖలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ఉబర్‌ వంటి అగ్రశ్రేణి ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయ, భారతీయ మూలాలున్న దాదాపు 150 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు సంతకాలు చేశారు.బెంగళూరుతోపాటు శాన్‌ ఫ్రాన్సిస్కో, సియాటెల్‌, లండన్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాలకు చెందిన టెకీలు ఈ లేఖ రాసిన వారిలో ఉన్నారు. ఇది తమ వ్యక్తిగత అభిప్రాయమని, తమ సంస్థలకు దీనితో సంబంధం లేదని స్పష్టం చేశారు.

 


‘టెక్‌ అగేనెస్ట్‌ ఫాసిజం’ పేరుతో ఉన్న ఈ లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ‘టెక్నాలజీ పరిశ్రమకు చెందిన ఇంజినీర్లు, డిజైనర్లు, పరిశోధకులు, విశ్లేషకులమైన మేము భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాసిస్టు చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరసనకారులపై ప్రభుత్వం జరుపుతున్న దమనకాండను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. సీఏఏ, ఎన్నార్సీ ఒకదానితో ఒకటి ముడివడి ఉన్నాయి. ఈ పథకం ముస్లింలకు పూర్తిగా వ్యతిరేకం. ఇది ముస్లింలకు నిలువ నీడ లేకుండా చేయడంతోపాటు అసమానతలను సృష్టిస్తుంది’ అని పేర్కొన్నారు. దేశంలో రికార్డు స్థాయికి చేరిన నిరుద్యోగం, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు, ధ్వంసమవుతున్న పర్యావరణం వంటి తీవ్రమైన సమస్యలను కప్పిపుచ్చేందుకు, ప్రజలను తప్పుదోవపట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అమలుచేస్తోంద‌ని మండిపడ్డారు.

 

ప్రభుత్వం ఇష్టానుసారం ఢిల్లీ, అసోం, కశ్మీర్‌ వంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్‌పై నిషేధం విధిస్తున్నదని మండిపడ్డారు. ‘ఈ తిరోగమన ప్రభుత్వం ఓవైపు దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా మారుస్తున్నామని, టెక్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నది. మరోవైపు పౌరుల గొంతును అణచివేయడానికి ఇంటర్నెట్‌ను ఓ రాజకీయ సాధనంగా వాడుకుంటున్నది. అదేసమయంలో నకిలీవార్తల వ్యాప్తికి అన్ని నెట్‌వర్క్‌లను వినియోగించుకుంటున్నది’ అని తీవ్రంగా విమర్శించారు. సుందర్‌ పిచాయ్‌ (ఆల్ఫాబెట్‌, గూగుల్‌), సత్యనాదెళ్ల (మైక్రోసాఫ్ట్‌), మార్క్‌ జుకర్‌బర్గ్‌ (ఫేస్‌బుక్‌), జాక్‌ డోర్సే (ట్విట్టర్‌), దారా ఖోస్రోషాహి (ఉబర్‌), ముఖేశ్‌ అంబానీ (జియో), గోపాల్‌ విఠల్‌ (ఎయిర్‌టెల్‌), కల్యాణ్‌ కృష్ణమూర్తి (ఫ్లిప్‌కార్ట్‌, శంతను నారాయణ్‌ (అడోబ్‌) వంటి టెక్‌ కంపెనీల యజమానులు ఈ చట్టాన్ని బహిరంగంగా వ్యతిరేకించాలని కోరారు. ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని, వినియోగదారుల వివరాలను ప్రభుత్వాలకు వెల్లడించవద్దని, ఇంటర్నెట్‌ సేవలను ఇష్టానుసారం నిషేధించడాన్ని ఖండించాలని, టెక్నాలజీని మంచి కోసం ఒక సాధనంగా, ప్రజలను ఏకంచేసే మార్గంగా వినియోగించాలని వారికి విజ్ఞప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: