దేశంలో ప్ర‌స్తుతం ఆర్థిక‌ ప‌రిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ప్ర‌ధానంగా ఆర్థిక వృద్ధి తీవ్రంగా ప్ర‌భావితం అవుతున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధి దారుణంగా పతనమవడంతో రుణ వృద్ధి విస్తరణ (క్రెడిట్ ఎక్స్‌పాన్షన్) రేటుపై కటిక చీకట్లు అలుముకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2019-20) ద్వితీయ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 4.5 శాతానికి పతనమై ఆరేండ్ల కనిష్ఠస్థాయికి చేరడంతో రుణవిస్తరణ (క్రెడిట్ ఎక్స్‌పాన్షన్) వృద్ధిరేటు 6.5 నుంచి 7 శాతానికి క్షీణించి ఆరు దశాబ్దాల కనిష్ఠస్థాయికి దిగజారవచ్చని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొన్నది. గత ఆర్థిక సంవత్సరంలో దేశ రుణవిస్తరణ వృద్ధిరేటు 13.3 శాతంగా ఉన్నట్టు ఇక్రా తెలిపింది. ప్రస్తుతం తమ అంచనాలు నిజమైతే ఈ ఆర్థిక సంవత్సరంలో రుణవిస్తరణ వృద్ధిరేటు 58 ఏండ్ల కనిష్ఠస్థాయికి చేరుతుందని, 1962 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 5.4 శాతంగా నమోదయినట్టు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) వెబ్‌సైట్‌లోని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయని ఆ సంస్థ వివరించింది. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 5 శాతంగా నమోదైన జీడీపీ వృద్ధిరేటు రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్)లో 4.5 శాతానికి క్షీణించి ఆరేండ్ల కనిష్ఠస్థాయికి దిగజారిన విషయం తెలిసిందే. మున్ముందు కూడా జీడీపీ వృద్ధిరేటు గణాంకాలు ఇంతకంటే మెరుగ్గా ఉంటాయని ఎవరూ అంచనావేయడంలేదు. 

 

ప్ర‌స్తుత‌ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతం మేరకు నమోదుకావచ్చని భావిస్తున్నట్టు ఫిబ్రవరిలో చెప్పిన ఆర్బీఐ సైతం ఇప్పుడు తన అంచనాలను గణనీయంగా 5 శాతానికి (240 బేసిస్ పాయింట్లు) కుదించింది. ఇదేవిధంగా పలు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా భారత ఆర్థిక వృద్ధిరేటుకు సంబంధించిన అంచనాలను సవరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను 5.8 శాతం నుంచి 4.9 శాతానికి కుదిస్తున్నట్టు మూడీస్ సంస్థ ప్రకటించగా.. ఈ ఏడాది జీడీపీ వృద్ధిరేటు 4.6 శాతం మించకపోవచ్చని జపాన్ బ్రోకరేజీ సంస్థ నొమురా పేర్కొన్నది. నవంబర్ నెలాఖరు వరకు రుణవిస్తరణ వృద్ధిరేటు దాదాపు 8 శాతం మేరకు ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇంక్రిమెంటల్ క్రెడిట్ గ్రోత్ స్తబ్దుగా ఉన్నందున రుణవిస్తరణ వృద్ధిరేటు మరింత తగ్గవచ్చని భావిస్తున్నామని ఇక్రా వెల్లడించింది. జీడీపీ వృద్ధిరేటు మందగించడం, మూలధన పెట్టుబడుల అవసరాలు తగ్గడం, రిస్క్ తీసుకొనేందుకు రుణదాతలు విముఖంగా ఉండటం లాంటి అంశాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంక్రిమెంటల్ క్రెడిట్ గ్రోత్‌ను తగ్గిస్తాయని, ఫలితంగా నాలుగు ప్రధాన రంగాలైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, రిటైల్ రుణాల రంగాల్లో మూడింటి నుంచి నిధులకు డిమాండ్ స్వల్పంగా ఉంటుందని ఇక్రా తన నివేదికలో అభిప్రాయపడింది. 

 

ఈ నెల 6వ తేదీ వరకు ఇంక్రిమెంటల్ క్రెడిట్ గ్రోత్ కేవలం రూ.80 వేలకోట్లు మాత్రమే పెరిగి రూ.98.1 లక్షలకోట్లకు చేరిందని, ఈ పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.4 లక్షలకోట్లుగానూ, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.1.7 లక్షలకోట్లుగానూ ఉన్నదని ఆ సంస్థ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో ఇంక్రిమెంటల్ క్రెడిట్ రూ.6.5 లక్షలకోట్ల నుంచి రూ.7 లక్షలకోట్ల మేరకు పెరిగినప్పటికీ ఇంక్రిమెంటల్ నెట్ బ్యాంక్ లోన్ 40 నుంచి 45 శాతం మేరకు తగ్గి రూ.6.3 లక్షలకోట్ల నుంచి రూ.6.8 లక్షలకోట్లకు తగ్గుతుందని ఇక్రా పేర్కొన్నది. ఏ.

మరింత సమాచారం తెలుసుకోండి: