ఆంధ్ర ప్రదేశ్  జర్నలిస్టుల్లో గత మూడు నెలల నుంచి అక్రిడిటేషన్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతోంది. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ల విషయంలో అనేక నిబంధనలను, షరతులను పెట్టడంతో రోజువారీ దీనిపై చర్చలు,ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయి. నూతనంగా తీసుకు వచ్చిన అక్రిడిటేషన్‌ పాలసీలో ఉన్న నిబందనలపై చిన్న,మధ్య తరహా పత్రికల జర్నలిస్టులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎపానెల్‌మెంట్‌, జిఎస్‌టి నిబందనలతో వారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా జిఎస్‌టి నిబందన తీసుకురావడం చిన్న పత్రికలు, మధ్యతరహా పత్రికలపై సమ్మెటపోటు వేసినట్లయింది. దీనిపై పలు జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు సమాచారశాఖ మంత్రి పేర్నినాని, సమాచారశాఖ కమీషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డిని పలుసార్లు కలసివిన్నవించినా..వారు దీనిపై సానుకూలంగా స్పందించలేదు. అర్హులైన జర్నలిస్టులకు మాత్రమే అక్రిడిటేషన్‌ ఇస్తామని, అనర్హులకు ఇస్తే..అవి దుర్వినియోగం అవుతున్నాయని,తమ ప్రభుత్వం అర్హులైనవారిని గుర్తించి వారికి మాత్రమే అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని తేల్చిచెప్పారు. అంతే కాకుండా ఈసారి అక్రిడిటేషన్లను ఆన్‌లైన్‌లో పెడుతున్నామని, అక్రిడిటేషన్లు కావాల్సిన వారు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు చేసుకోవాలని నిబంధనలు పెట్టారు. చిన్న,మధ్యతరహా పత్రికల జర్నలిస్టులు, సంఘాలు దీనిపై పలు అభ్యంతరాలు, నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. చివరకు..ఆనలైన్‌లోనే జర్నలిస్టులు పలు తిప్పలుపడి ధరఖాస్తులు చేసుకున్నారు. ఒకవైపు ఆందోళనలు చేస్తూనే.. మరోవైపు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు చేసుకుని..నేడో..రేపో అర్హులైన వారికి అక్రిడిటేషన్లు వస్తాయని ఎదురు చూస్తుండగా..ఇప్పుడు నూతనంగా అక్రిడిటేషన్లు ఇచ్చేది లేదని, పాత వాటినే ఆరు నెలల పాటు..పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉందనే వార్తలు..జర్నలిస్టు వర్గాలను నివ్వెరపరిచాయి. నిన్న మొన్నటి దాకా...ఆగమేఘాలపై ధరఖాస్తులు చేసుకోండి....వెంటనే ఇచ్చేస్తామన్న వారు..ఇప్పుడు ఆరు నెలలు ఎందుకు పొడిగిస్తున్నారు..హఠాత్తుగా ఆరు నెలల పొడిగింపుఎందుకు..? అనే దానిపై మీడియా వర్గాల్లో విస్తృతమైన ఆసక్తిరకమైన చర్చ జరుగుతోంది.

అసలేం జరిగింది...!
జనవరి 1వ తేదీ కల్లా నూతన అక్రిడిటేషన్లు ఇస్తామని సమాచారశాఖ మంత్రి, సమాచారశాఖ కమీషర్‌ బల్లగుద్ది మరీ చెప్పారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుని ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అక్రిడిటేషన్‌ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిలో కూడా మీడియా కమిటీని నియమించేందుకు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసిన తరువాత ఈరోజు అనగా (శనివారం28వ తేదీన) మీడియా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఒక వేళ కుదరకపోతే సోమవారం నాడు కమిటీ సమావేశం ఉంటుందని అనధికారికంగా తెలిపారు. అయితే ఇప్పుడు ఈ సమావేశం నిర్వహించేది డోలాయమానంలో పడింది. ఆరు నెలల పొడిగిస్తారని,రాజధాని మార్పువల్లే ఆరు నెలల పొడిగింపు అని అంతర్గత సమావేశంలో సమాచార అధికారులు చెబుతున్నా..అసలు కారణం అది కాదని జర్నలిస్టు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మీడియా కమిటీలో తమకు ఇష్టం లేని వ్యక్తులు ఉండడం వల్లే మీడియా కమిటీ సమావేశం నిర్వహించకుండా ఆరు నెలలు పొడిగింపు చేశారని ఆయా వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాష్ట్ర మీడియా కమిటీలో తెలుగుదేశం సానుభూతిపరులు ఉన్నారని, వారిలో ఒక సభ్యుడు గత ఎన్నికల సమయంలో టిడిపి టిక్కెట్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారని, టిడిపి జెండా పట్టుకుని ఆ పార్టీకి ప్రచారం చేశారని, అటువంటి వ్యక్తిని కమిటీలో ఎలా వేస్తారని ప్రభుత్వానికి మద్దతునిచ్చే పత్రికకు సంబంధించిన మీడియా పెద్దలు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు.  మీడియా కమిటీ జీవో వచ్చిన రోజే ప్రభుత్వ పత్రికలో పనిచేసే పెద్దతలకాయ దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో మీడియా కమిటీ సమావేశాన్ని నిర్వహించవద్దని, మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నేడో రేపో మీడియా కమిటీ సమావేశం నిర్వహించాలని భావించిన సమాచారశాఖ అధికారులు నేడు ఆరు నెలలు పొడిగింపు చేస్తామని లీకులు ఇస్తున్నారు.

పాపం అధికారులు..! 

రాష్ట్ర సమాచారశాఖ అధికారులు..ఎట్టి పరిస్థితుల్లో జనవరి 1వ తేదీ కల్లా నూతన అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని ఉరుకుల పరుగులతో పనులు చేస్తున్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ విధానం వల్ల కొన్ని సమస్యలు వచ్చినా..వాటిని వెంటనే పరిష్కరించి ఆన్‌లైన్‌లో ధరఖాస్తులకు మార్గాన్ని సుగమమం చేశారు. మరో వైపు జిల్లా స్థాయిలో డీడీలకు నూతన విధానంపై శిక్షణ నిర్వహించారు. అదే విధంగా జర్నలిస్టులకు నూతన విధానం ద్వారా వస్తోన్న సమస్యలపై నిరంతరం సమాచారం ఇస్తూ వారికి సహకరించారు. ఇక నేడో..రేపో..అక్రిడిటేషన్లు మంజూరు చేసి, తమపై  నెలకొన్న భారాన్ని దించుకోవాలని వారు భావించగా..రాష్ట్ర మీడియా కమిటీ వివాదంతో అర్ధరాత్రుల వరకు పనిచేసిన అధికారులు, సిబ్బంది ఉస్సూరమంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: