దాదాపు అన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం తొమ్మిది గంటలవరకు తెరలు తెరలుగా మంచు కమ్ముకుంటోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాల‌ను చలిగాలులు వణికిస్తున్నాయి. మొన్నటివరకు రాత్రిపూట సాధారణంగా ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అయితే, ఈశాన్య దిశనుంచి వీస్తున్న శీతలగాలులతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉష్ణోగ్రతలు ఒక్కరోజులోనే అనూహ్యంగా పడిపోయాయి. తూర్పు, ఆగ్నేయం వైపునుంచి వీస్తున్న గాలులు దిశను మార్చుకోవడంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. రాగల 48 గంటల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి చలిగాలులు వీస్తాయని చెప్పారు. రెండురోజుల తర్వాత ఉత్తరాది నుంచి కూడా చలిగాలులు వీస్తాయని దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవచ్చని విశ్లేషించారు.

 

ఎముకలు కొరికే చలితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఆకాశం మేఘావృతమై సోమవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశమున్నదని వివరించారు. చలి తీవ్రత పెరుగడంతో సింగరేణిలో కార్మికుల హాజరు 15 నుంచి 18 శాతంవరకు తగ్గిపోయింది.

 

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఉష్ణోగ్ర‌త‌లు ఉన్నాయి.  శనివారం ఆదిలాబాద్‌ జిల్లాలోని తాంసి, బరంపూర్‌, భోరజ్‌లో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అర్లి ‘టీ ’లో 7.2, తలమడుగు 7.9, ఆదిలాబాద్‌ అర్బన్‌లో 8.6, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెదారిలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలుగా నమోదవగా, శనివారం ఒక్కసారిగా 7.6 డిగ్రీలకు పడిపోయింది. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. చలికి ఈదురుగాలులు తోడవటంతో జిల్లాలోని వాతావరణం కశ్మీర్‌ను తలపిస్తున్నది. కామారెడ్డి, ములుగు జిల్లాల్లో 11, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల 12, మంచిర్యాల 12.2, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ రూరల్‌, రాజన్న సిరిసిల్ల 13, వరంగల్‌ అర్బన్‌, కరీంనగర్‌ 14, జనగామ 14.1, యాదాద్రి భువనగిరి 15, మెదక్‌ 15.1, నల్లగొండ 15.2, వికారాబాద్‌ 15.6, హైదరాబాద్‌లో 18 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: