పర్వేజ్‌ ముషారఫ్‌....పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు. రాజద్రోహం నేరం కింద మరణశిక్ష విధిస్తూ గత వారం ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిలిచిన వ్య‌క్తి. ప్రత్యేక కోర్టుకు నేతృత్వం వహించిన పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వఖార్ అహ్మద్ సేథ్ తీర్పును వెలువరిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ``ముషారఫ్‌ను అదుపులోకి తీసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నించండి. అనంతరం అతడికి చట్ట ప్రకారం మరణశిక్ష అమలు చేయండి. ఒకవేళ శిక్ష అమలు కంటే ముందే అతడు చనిపోతే.. అతడి మృతదేహాన్ని ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనం, ప్రధాని కార్యాలయం, పార్లమెంట్, సుప్రీంకోర్టు ఉండే ప్రాంతానికి సమీపంలోని డెమోక్రటిక్ చౌక్ వద్దకు ఈడ్చుకెళ్లి మూడు రోజులపాటు వేలాడదీయండి``అని పేర్కొన్నారు. ఇలా సంచ‌ల‌న కామెంట్లు వ‌చ్చిన నేప‌థ్యంలో....త‌న తీర్పును సవాల్‌ చేస్తూ పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

 

ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ముషారఫ్‌ తరఫున న్యాయవాది అజార్‌ సిద్దిఖి లాహోర్‌ హైకోర్టులో 86 పేజీల పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వాన్ని, ఇతరులను ప్రతిపవాదులుగా చేర్చారు. తీర్పు క్ష‌మరాహిత్యంగా, విరుద్ధ ప్రకటనల మిశ్రమంగా ఉన్నదని పేర్కొన్నారు. విచారణను వేగంగా, తొందరపాటుతో జరిపారని చెప్పారు. జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే ఎటువంటి చర్యలను ముషారఫ్‌ తీసుకోలేదని పేర్కొన్నారు. న్యాయస్థానానికి సమర్పించిన సాక్ష్యాల్లో సైతం అతనిపై రాజద్రోహం నేరం లేదని అన్నారు. జస్టిస్‌ మజాహిల్‌ అలీఅక్బర్‌ నఖ్వి నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 9న ఈ పిటిషన్‌పై వాదనలను విననున్నది. అనారోగ్యంతో దుబాయిలో చికిత్స పొందుతున్న ముషారఫ్‌.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దుచేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

 

ఇదిలాఉండ‌గా, .167 పేజీలున్న ఈ తీర్పుపై పాక్ సైన్యం మరోసారి మండపడింది. మానవ హక్కులు, మత పరమైన, నాగరికత పరమైన విలువలకు విరుద్ధంగా కోర్టు తీర్పు ఉన్నదని తెలిపింది. తీర్పుపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, సైన్యాధిపతి జనరల్ బజ్వా కలిసి చర్చించారని, కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారని, వాటిని త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: