ఏపీ రాజధాని గా విశాఖ ను బాగా ప్రమోట్ చేసేందుకు జగన్ బలంగా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ వస్తున్న ఉత్తరాంధ్రలో పాగా  వేయాలంటే రాజకీయంగా దూకుడు పెంచాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఈ ప్రాంతంలో వైసిపి హవా పెరిగేలా చేయాలంటే రాజకీయంగా తమకు ఎదురు లేకుండా చేసుకోవాలని జగన్ చూస్తున్నారు. దానికి అనుగుణంగానే తన రాజకీయ ఎత్తుగడలకు పదునుపెడుతున్నారు. అసలు ఇప్పటికే విశాఖను రాజధానిగా ప్రకటించగానే పార్టీలకు అతీతంగా జగన్ నిర్ణయానికి అంతా మద్దతు పలికారు. వాస్తవంగా చెప్పుకుంటే విశాఖ సిటీ లో వైసీపీకి అంతగా ఆదరణ లేదు. 


ఇక్కడ వైసీపీ కంటే టిడిపీ కే బలమైన నేతలు ఉన్నారు. వారు టిడిపిలో అత్యంత సీనియర్లు కావడంతో పార్టీ ఇక్కడ ఇప్పటికీ బలంగా ఉంది. వారిని ఇప్పుడు వైసిపి గూటికి తీసుకువచ్చేలా జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ముందుగా టిడిపిలో ఉన్న అసంతృప్తి నాయకులను గుర్తించి వారిని తమ పార్టీలో చేరేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా టిడిపి పై అసంతృప్తి తో ఉన్న మైనార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ రహమాన్ ను టీడీపీకి రాజీనామా చేసేలా చేశారు. త్వరలోనే ఆయన వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. విశాఖలో మైనారిటీలు ఎక్కువగా ఉండడంతో వారిని తమ వైపు తిప్పుకోవడానికి రహమాన్ వైసిపిని టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 


అలాగే గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ను కూడా వైసీపీ వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టిడిపి పరోక్షంగా మద్దతు ఇచ్చి తనకు చంద్రబాబు దెబ్బకొట్టారనే బాధ శ్రీనివాస్ కు ఎక్కువగా ఉంది. అందుకే ఆయన వైసీపీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా వైసీపీ లోకి వస్తే పార్టీ మరింత పుంజుకుంటుందని జగన్ భావిస్తున్నారు. వీరే కాకుండా ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చూపంతా వైసీపీ వైపే ఉంది. 

ఆయన కాకుండా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్యే గణబాబు వైసీపీ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి చేరికకు జగన్ ఓకే చెప్పడం ఒక్కటే మిగిలి ఉంది. ఇలా బలమైన నాయకులంతా వైసీపీలోకి వచ్చేస్తే క్రమంగా అక్కడ టిడిపి బాగా దెబ్బతిని వైసీపీ మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: