ప్రపంచంలోనే అత్యధికంగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నది భారతీయులే. కేవలం సమాచార రంగానికేగాక, ఇంటర్నెట్‌ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నది. వాణిజ్య సేవల్లో ప్రధానమైపోయింది. టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ.. ఇంటర్నెట్‌ వినియోగమూ విస్తృతమైపోతున్నది. నేడు ఇంటర్నెట్‌తో మనిషికి విడదీయరాని బంధమే ఏర్పడింది. నెట్‌ లేకుండా రోజు గడువని పరిస్థితి నెలకొన్నదంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం సైతం డిజిటలైజేషన్‌ను ప్రోత్సహిస్తోంది. అలాంటిది ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోతుండటంతో అందరూ అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాత ఆర్థిక లావాదేవీల్లో ఇంటర్నెట్‌ ముఖ్య పాత్ర వహిస్తున్న సంగతి విదితమే. ప్రతీ క్షణం దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల నగదు రహిత లావాదేవీలు జరిగిపోతున్నాయి. అల్లర్లు.. ఆందోళనలు.. నిరసనల కారణంగా టెల్కోలు భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అల్లరి మూకల విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకునే ముందు జాగ్రత్తలు టెలికం కంపెనీలకు భీకర నష్టాల్నే తెచ్చిపెడుతున్నాయి. ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో వీటన్నిటికీ అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా టెలికం సంస్థలకేగాక, బ్యాంకులు, ప్రకటనదారులు ఇతరత్రా అన్ని రంగాలను ప్రభావితం చేస్తోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

ఇటీవలికాలంలో వివిధ ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేకత పెరిగి తరచూ ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది, ఈశాన్య రాష్ర్టాలు ప్రస్తుతం అట్టుడికిపోతున్న సంగతీ విదితమే. దీంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వదంతులు వ్యాపించకుండా కేంద్రం.. ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేస్తున్నది. దీనివల్ల టెల్కోలకు ప్రతీ గంటకు రూ.2.45 కోట్ల (3.5 లక్షల డాలర్లు) నష్టం వాటిల్లుతున్నదని భారతీయ మొబైల్‌ ఆపరేటర్ల సంఘం డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ తెలిపారు. ఇంటర్నెట్‌ నిలుపుదలతో టెలికం సంస్థలకు వాటిల్లుతున్న నష్టాలకుతోడు వ్యాపార రంగం నష్టాలనూ కలిపితే గంటకు రూ.3.67 కోట్ల నష్టం వస్తున్నదని మాథ్యూస్‌ చెప్పారు. ఇప్పటికే సర్దుబాటు స్థూల వార్షిక ఆదాయం (ఏజీఆర్‌) అంశంలో సుప్రీం కోర్టు ఆదేశంతో టెలికం పరిశ్రమపై రూ.1.47 లక్షల కోట్ల భారం పడిందని, ఈ క్రమంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిచి మరిన్ని నష్టాలు వాటిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

 

 

మోదీ సర్కారు పాలనలోనే ఇంటర్నెట్‌ సేవలు ఎక్కువసార్లు నిలిచిపోతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేనంతగా ఈ సంఖ్య భారీగా ఉంది. 2018లో 134సార్లు ఇంటర్నెట్‌ సేవలు ఆగిపోగా, 2019లో ఇప్పటిదాకా 104సార్లు నిలిచిపోయాయి. ఈ మేరకు ఇంటర్నెట్‌షట్‌డౌన్స్‌డాట్‌ఇన్‌ తెలియజేసింది. సాఫ్ట్‌వేర్‌ ఫ్రీడం లా సెంటర్‌ (ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ) ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నది. దేశంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయిన సమాచారాన్ని ఇది నిక్షిప్తం చేస్తుంటుంది. ఈ ఏడాది ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్ము అండ్‌ కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగినది తెలిసిందే. అత్యధికంగా ఇక్కడే మోదీ సర్కారు ఎక్కువగా ఇంటర్నెట్‌ను ఆపేసిందని, 140 రోజులు ఇక్కడ ఇంటర్నెట్‌ నిలిచిపోయిందని ఇంటర్నెట్‌షట్‌డౌన్స్‌డాట్‌ఇన్‌ తెలిపింది. దీంతో పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడే ఇంటర్నెట్‌ సేవలను ఆపేయాలని, అప్పటిదాకా దాని జోలికి వెళ్లకపోతే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: