తెలంగాణ రాష్ట్ర స‌మితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు త‌న దూకుడు కొన‌సాగిస్తున్నారు. కీల‌క‌మైన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర కొనసాగించాలని ఆయ‌న ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో కలిసికట్టుగా పనిచేసి గెలుపుబాట‌లో న‌డిపించాల‌ని వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈ మేర‌కు  పార్టీ క్యాడర్‌ను సమన్వయ పరిచి, అన్ని స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేసే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ మేర‌కు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

 

వ‌రుస‌గా రెండో రోజు కూడా మున్సిప‌ల్ ఎన్నిక‌ల విష‌యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అన్ని వార్డులు, డివిజన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచేవిధంగా పనిచేయాలన్నారు. ప్రతిపక్షాల నుంచి అంతగా పోటీ లేకున్నా.. ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లువేసి, సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి ప్రభుత్వ పథకాలను మరోసారి గుర్తుచేయాలని ఉద్బోధించారు. ఇం టింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. 

 

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో వివిధ జిల్లాల్లో మున్సిపాలిటీలవారీగా టీఆర్‌ఎస్‌ పార్టీ సన్నాహక సమావేశాలను నిర్వహిన్నారు. ఆయా సమావేశాలకు జిల్లా మంత్రులు, ముఖ్య నాయకులు హాజరై.. కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతున్నారు. ప్రచారవ్యూహం, ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడం, ఓటర్ల జాబితా తదితర అంశాలను వివరిస్తున్నారు. తాజా సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌, హరిప్రియ నాయక్‌, నన్నపనేని నరేందర్‌, రాములునాయక్‌, దివాకర్‌రావు, పైలట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: