వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ మతానికి ప్రయారిటీ పెరిగిందన్న ప్రచారం జరగుతోంది. సీఎం జగన్ స్వయంగా క్రైస్తవుడు కావడం ఇందుకు ఓ కారణం కావచ్చు. జగన్ క్రైస్తవుడన్న సంగతి ఎప్పటి నుంచో తెలిసిందే. ఆయన తాతల కాలం నుంచి వైఎస్ కుటుంబం క్రైస్తవాన్ని పాటించింది.

 

జగన్ సీఎం అయ్యాక ఏపీలో క్రైస్తవం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఓ సెక్షన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీటీడీ కేలండర్ లో ఏసయ్య నినాదం ఉందని.. తిరుపతి కొండపై సిలువ ఉందని ఇలా చాలా ప్రచారాలు జరిగాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వ సొమ్ముతో చర్చిలు కట్టిస్తున్నాడని ప్రచారం సాగుతోంది. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ నిజాంపట్నం మండలంలోని మూడు చర్చిల నిర్మాణానికి 15 లక్షలు చొప్పున 45 లక్షలు విడుదల చేయాలని క్రిస్టియన్ మైనారిటీ శాఖకు ఆయన లేఖ రాశారట.


ఆయన రాసిన లేఖను పరిగణలోకి తీసుకున్న క్రిస్టియన్ మైనారిటీ శాఖ నిధుల విడుదలకు సరే అందని... అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నాక చర్చికి రూ.5 లక్షలు చొప్పున విడుదల చేసిందని.. ఆముదాల పల్లి, ఆముదాల పల్లి హరిజనవాడ, కళ్లిపాలెం గ్రామంలో మూడు చర్చిల నిర్మాణానికి ఈ నిధులు విడుదల చేస్తున్నామని ఆ ఉత్తర్వులో ఉన్నట్టు చెబుతున్నారు.

 

అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. మైనారిటీ శాఖ నిధులు మైనారిటీల కోసమే వినియోగిస్తారు. ఇప్పటికే మైనారిటీ శాఖ నిధులతో జరూషలేం యాత్రలు, హజ్ యాత్రలకు అనుమతిస్తున్నారు. అలాంటప్పుడు చర్చిలకు నిధులిస్తే మాత్రం పెద్ద విషయం ఏముందంటున్నారు జగన్ అభిమానులు. అదే సమయంలో.. జగన్ హిందూ స్వామీజీల వద్దకు వెళ్లి వారి ఆశీస్సులు తీసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. అలాంటి జగన్ ఓ మతానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోరని.. అంతా నిబంధనల మేరకే జరుగుతాయని.. వివరిస్తున్నారు. ఇది గిట్టని వారి దుష్ప్రచారం, జగన్ పై మతం ముద్ర వేసే ప్రయత్నమేనని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: