ప్రభుత్వ ఉద్యోగం అంటేనే అవినీతికి చిరునామాగా భావిస్తున్నారు. పెరిగిన టెక్నాలజీ సాయంతో కొన్ని శాఖల్లో అవినీతి తగ్గిపోయినా కొన్ని శాఖలు మాత్రం ఇంకా అవినీతి అడ్డాలుగానే ఉన్నాయి. అలాంటి వాటిలో అవినీతిలో రెవెన్యూ శాఖ అగ్రస్థానంలో ఉందట. 2019లో ఈ శాఖకు చెందిన 54 మంది అధికారులు లంచాలు స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కారట.

 

2018లో రెవెన్యూ ఉద్యోగులు 37 మంది దొరికారు. ఈఏడాది ఆ సంఖ్య మరింత పెరికిందన్న మాట. ఆ తర్వాత రెండోస్థానంలో పురపాలక శాఖ నిలిచింది. గతేడాది ఆ శాఖ ఉద్యోగులు 15 మంది చిక్కారు. ఈ ఏడాది 25 మంది పట్టుబడ్డారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏసీబీకి దొరికిన హోంశాఖ ఉద్యోగుల సంఖ్య తగ్గింది. గతేడాది 20 మంది పోలీసులు దొరికారు. ఈ ఏడాది ఆ సంఖ్య స్వల్పంగా తగ్గింది. 18 మంది అనిశాకు పట్టుబడ్డారు.

 

ఏసీబీకి చిక్కిన వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. 2018లో నలుగురు ఉద్యోగులు అనిశాకు చిక్కారు. ఈ ఏడాది ఆ శాఖ ఉద్యోగులు 13 మంది పట్టుబడ్డారు. ఇలా గత ఏడాది అన్ని శాఖల్లో కలిపి 139 మంది అధికారులు, ఉద్యోగులు ఏసీబీ చిక్కారు. ఈ ఏడాది ఆ సంఖ్య 173కు చేరింది. గతేడాది కంటే సుమారు 25 శాతం అదనంగా అవినీతి చేపలు పట్టుబడినట్టు అవినీతి నిరోధక శాఖ విడుదల చేసిన గణాంకాలు ద్వారా స్పష్టమవుతోంది.

 

ఇక ఈ ఏడాది అవినీతి నిరోధకశాఖకు అత్యధికంగా 54 మంది రెవెన్యూ ఉద్యోగులు చిక్కారు. గత ఏడాది కూడా ఇదే శాఖ మొదటి స్థానం ఆక్రమించింది. ఈ ఏడాది మరోసారి అదే బాటలో నిలిచింది. ఈ శాఖ అవినీతికి మారు పేరుగా నిలుస్తోంది. ఆ తర్వాత స్థానాన్ని పురపాలక, హోం శాఖ ఆక్రమించాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: