ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండొచ్చని ప్రకటన చేసిన రోజు నుండి రాష్ట్రంలో నేతల నుండి కొత్త కొత్త డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా వైసీపీ పార్టీ కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి రాయలసీమలోని అనంతపురంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. అనంతపురం జిల్లాలో అసెంబ్లీని ఏర్పాటు చేసి అనంతపురంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం వలన అనంతపురం అభివృద్ధి చెందుతుందన్ని సిద్దారెడ్డి అన్నారు. 
 
వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు కూడా ఆయా జిల్లాలలో ఏర్పాటు చేయాలని పీవీ సిద్ధారెడ్డి కోరారు. వైసీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి అనంతపురంలో అసెంబ్లీ పెట్టాలంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ రాజ్యసభ అధ్యక్షుడు టీజీ వెంకటేష్ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయటంతో పాటు మినీ సచివాలయంను కూడా కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
రాయలసీమకు చెందిన కొందరు నేతలు హైకోర్టుతో పాటు కర్నూలులోనే రాజధానిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కు లేఖలు రాస్తూ ఉండటం గమనార్హం. మాజీమంత్రి మైసూరా రెడ్డిలాంటి వారు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి హైకోర్టు బెంచ్ లు రెండు ఏర్పాటు చేసినా ఎటువంటి ఉపయోగం లేదని వాదిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం హై పవర్ కమిటీ నివేదికకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనుంది. 
 
హై పవర్ కమిటీ సిఫార్సులను అసెంబ్లీలో చర్చించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించనుంది. మరోవైపు జగన్ ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయంపై అమరావతి రైతుల నుండి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రజాభిప్రాయం మేరకే రాజధానులు ఉంటాయని చెబుతూ ఉండటంతో  సొంత పార్టీ నేతలు , ఇతర పార్టీల నేతలు చేస్తున్న డిమాండ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తూ ఉండటం వైసీపీ పార్టీ నేతలకు తలనొప్పిగా తయారైందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: