తెలుగు రాష్టాల రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలంగాణ రాజకీయాల గురించి ఇక్కడి నాయకులు, ఏపీ రాజకీయాల గురించి తెలంగాణ నాయకులు చర్చించుకుంటూనే ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఏ పార్టీ గెలుస్తుందో అనే ఆతృత, ఆసక్తి రెండు రాష్ట్రాల్లోనూ నెలకొంది. ఎప్పటికప్పుడు ఇలా రెండు రాష్ట్రాల్లోని పార్టీలు అప్పటి పరిస్థితులపై కూడా ఆరా తీస్తూంటాయి. ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల అంశం జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు.

 

 

వృత్తిపరంగా కేటీఆర్ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలిస్తారు. వారు కోరే అభిప్రాయాలకు కూడా తనదైన రీతిలో స్పందిస్తారు. ఇందులో భాగంగానే ప్రస్తుత ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందించారు. ‘ఏపీలో మూడు రాజధానులపై మీ అభిప్రాయమేంటి. తెలంగాణ పౌరుడిగా కాకుండా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి’ అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ‘మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆ రాష్ట్ర ప్రజలే.. నేను కాదు’ అని తన స్టైల్లో సమాధానం చెప్పారు. ఏపీలో జగన్ తో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న ఈ తరుణంలో కేటీఆర్ చెప్పిన సమాధానం ఆసక్తిగా మారింది.

 

 

నిజానికి.. కేటీఆర్ ను చాలా మంది ఏపీ రాజకీయాల గురించి ఎప్పుడూ ఏదొక ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఆయన అభిప్రాయం కోరుతూనే ఉంటారు. ప్రతిసారీ కేటీఆర్ ఇదే సమాధానం చెప్పారు. ఎక్కడా కంట్రవర్సీ కాకుండానే చూస్తారు. గతంలో కూడా.. లోకేశ్ పై, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఇలానే పలు ప్రశ్నలను ఎదుర్కొన్న కేటీఆర్ ఇలా ఆసక్తికరంగానే స్పందించారు. రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండగ తర్వాత నిర్ణయం తీసుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: