తనకు ఏ మాత్రం  పెండింగ్‌ అంటే గిట్టదని.. గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు పైళ్లను  పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. శనివారం  ఇన్‌చార్జ్‌ సీపీ నర్సింహ రాములు, ఏసీపీలు గణపతి, ప్రకాశ్‌రెడ్డితో వరంగల్‌ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్‌ చాంబర్‌లో ఆమె టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యా రు.

 

 టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధించిన భవన నిర్మాణాలు, ఫైళ్లు, అపార్టుమెంట్‌లు, ల్యాండ్‌ యూసేజ్, మార్టిగేజ్, అడ్వర్టజ్‌మెంట్‌ ఫీజుల తదితర అంశాలపై  ఆరా తీశారు. అంతేకాదు పైళ్ల పరిష్కారానికి ఆన్‌లైన్‌ ఉపయోగిస్తున్నందున జాప్యం ఉండకూడదన్నారు. ప్రకటన బోర్డుల ఏర్పాటులో కఠినంగా వ్యవహరించాలని, డివిజన్ల వారీగా  అనధికార భవనాల వివరాలను అందచేయాలన్నారు. ఏసీపీ సాంబయ్య, టీపీఎస్‌ బషీర్, టీపీబీఓలు పాల్గొన్నారు.

 

అధికారులు, సిబ్బందిని  కమిషనర్‌ పమేల సత్పతి తనిఖీలతో పరుగులు పెట్టించారు. శనివారం ఆమె ఎవరికీ సమాచారం ఇవ్వకుండా  ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అంతేకాదు ఆమె పారిశుధ్ధ్యం పనులెలా సాగుతున్నాయి.. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ తీరుపై ఆరా తీశారు.  40, 43 గ్రేటర్‌ పరిధిలోని డివిజన్లలో పర్యటన సందర్భంగా ఇళ్ల ఎదుట, రోడ్ల మీద చెత్త ఉండడంతో స్థానికులను మందలించారు. అలాగే,కమిషనర్‌  డ్రెయినేజీలు, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకపోవడంపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లు అనిల్‌ కుమార్, నరేందర్‌ను  మందలించారు. ఆర్‌అండ్‌బీ భవనంలో మద్యం ఖాళీ బాటిళ్లు, చెత్త చెదారం ఉండడాన్ని గుర్తించిన ఆమె అసహనం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్‌ మిర్యాలాకర్‌ దేవేందర్‌ కమిషనర్‌ తనిఖీ చోటకు చేరుకొని పలుసమస్యలను వివరించారు.

 

దీంతో నూతన డ్రెయిన్‌ల నిర్మాణానికి శిథిలావస్థకు చేరిన చోట  ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఈ సారంగంను కమిషనర్‌ను ఆదేశించారు. ఇక వరంగల్‌ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని షీ–టాయిలెట్‌ను కమిషనర్‌ పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, ఫాతిమా నగర్‌లో పబ్లిక్‌ టాయిలెట్‌ను పరిశీలించారు. వడ్డేపల్లి బండ్‌ తనిఖీ సందర్భంగా పిచ్చిమొక్కలు పెరగడాన్ని గుర్తించిన కమిషనర్‌ సీహెచ్‌ఓ సునీతను ప్రశ్నించారు. తాను సెలవులో ఉన్నానని చెప్పగా.. మరొకరికి బాధ్యతలు అప్పగించాలే తప్ప పనులు పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. డీఈలు సంతోష్‌కుమార్, రవికిరణ్‌ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: