దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు కుటుంబాన్ని ఇంకా దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే కొడుకును పోగొట్టుకున్న ఆ కుటుంబం ఇప్పుడు ఇంటి పెద్దకు జరిగిన ప్రమాదంతో విలవిల్లాడుతోంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన చెన్నకేశవులు తండ్రి కురుమయ్య నిమ్స్‌లోని అత్యవసర విభాగంలోనే చికిత్స పొందుతున్నారు. 

 

అసలేమైందంటే.. గురువారం రాత్రి కురుమయ్య నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలోని జక్లేర్‌ నుంచి తమ స్వగ్రామం గుడిగండ్లకు బైకుపై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. తలకు బలమైన గాయాలవడంతో పాటు, మెదడు వద్ద రక్తం గడ్డకట్టింది. కోమాలోకి వెళ్లాడు. తలకు ఆపరేషన్‌ చేశారని, ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యిందని డాక్టర్లు తెలిపారని కురుమయ్య కుటుంబసభ్యులు తెలిపారు. ఐతే..ఇంకా ఐసీయూలోనే రెండు రోజులుండాలని చెప్పారు.  

 

అయితే.. ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి లోనైన ఇన్నోవా నడుపుతున్న వ్యక్తి అల్లుడు పోలీస్ శాఖలో ఏసీపీ కావడం విశేషం. దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ విచారణకు త్రిసభ్య కమిషన్‌ ఏర్పాటైంది. కురుమయ్య ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్‌సీకి స్టేట్మెంట్లు ఇచ్చాడు. తన కుమారుడిని ఎన్‌కౌంటర్‌ చేశారని చెప్పాడు. దీంతో ఈ ప్రమాదంపై అనుమానాలు వస్తున్నాయి.

 

దిశ కేసు నిందితుల కుటుంబాలు ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం తలుపు కూడా తట్టారు. దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయగా.. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నాయి. ఎన్ కౌంటర్ పై ఇప్పటికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్ ఆధ్వర్యంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని.. సాక్ష్యాలు తారుమూరు చేయకుండా సీపీ సజ్జనార్ సహా తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని పిటిషన్ లో కోరారు. ఎన్ కౌంటర్ నిందితుల ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం అందించేలా ఆదేశించాలని వారు అప్పుడు సుప్రీంకోర్టును కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: