తెలంగాణలో తెరాస పార్టీ 2014లో అధికారంలో రావడానికి హరీష్ రావు ఒక కారణం.  హరీష్ రావుకు తెలంగాణలోని గ్రామాల్లో మంచి పేరు ఉన్నది. తెలంగాణాలో ఎక్కడికి వెళ్లినా హరీష్ రావుకు ప్రజలు బ్రహ్మరధం పట్టేవారు.  అయితే, 2014లో హరీష్ రావుకు నీటిపారుదల శాఖ మంత్రిగా పదవి ఇచ్చారు.  ఆ పదవిని నిలబెట్టుకుంటూ.. కెసిఆర్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వహించారు.  


గొలుసుకట్టు పేరుతో చెరువులు తవ్వించారు.  వీటితో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే సమయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తారేమో అని చెప్పి ఎక్కువగా అక్కడే ఉండి పనులను నిర్వర్తించారు. రాత్రి సమయాల్లో కూడా అక్కడే నిద్రపోయారు.  అక్కడి నుంచే అయన అన్నిపనులు నిర్వహించారు.  ఇదే హరీష్ రావుకు మంచి పేరు తీసుకొచ్చింది.  2018 ఎన్నికల్లో హరీష్ భారీ విజయం సాధించారు.  ఈ విజయం తరువాత హరీష్ రావును కొన్నాళ్ళు కెసిఆర్ పక్కన పెట్టారు.  


ఎందుకో తెలియదుగాని, ఆయన్ను సిద్ధిపేట నియోజక వర్గానికి మాత్రమే పరిమితం చేశారు.  ఎమ్మెల్యేగా సిద్దిపేటకు తాను చేయాలి అనుకున్న పనులను వరసగా చేసుకుంటూ వెళ్లారు.  మట్టిగణపతులు, సిద్ధిపేట పట్టణం నిర్మాణం, చెట్ల పెంపకం ఇలా ప్రతి విషయంలో శ్రద్ద తీసుకున్నారు.  ఎందుకు దూరంపెట్టారో తెలియదు.  అయితే, తరువాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా హరీష్ రావుకు ఆర్థికశాఖ మంత్రిగా పదవిని కట్టబెట్టారు.  


ఆర్ధికశాఖ మంత్రిగా పదవిని ఇచ్చిన తరువాతహరీష్ రావు ప్రజలతో మమేకం కాలేరేమో అనుకున్నారు.  కానీ, హరీష్ రావు అనూహ్యంగా రాష్ట్రంలో వివిధ చోట్ల పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకుంటున్నారు.  ఇక స్కూల్స్ కు వెళ్లి అక్కడి విద్య గురించి, విద్య బోధన గురించి తెలుసుకుంటున్నారు.  విద్యార్థుల చదువుపై కొంత విచారం వ్యక్తం చేశారు.  సడెన్ గా హరీష్ రావు ఇలా మరలా ప్రజల్లోకి వెళ్తుండటం మంచిదే. అయితే, ఇప్పుడు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి.  వచ్చే ఏడాది కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టపెట్టె అవకాశం ఉన్నది అనే వార్తలు వస్తున్న సమయంలో హరీష్ రావు ఇలా రాష్ట్రంలో అనూహ్యంగా పర్యటన వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: